జీరో బడ్జెట్ వ్యవసాయమే సీఎం లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 05:05 AM
అన్నదాతలకు అన్ని విధాలా మేలుచేసే జీరో బడ్జెట్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ప్రకృతి సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
రైతులు సేంద్రియ సాగువైపు వెళ్లాలి: లోకేశ్
ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రైతు కుటుంబంతో గంట గడిపిన మంత్రి
ఎర్రగుంట్ల/ముద్దనూరు మే 22(ఆంధ్రజ్యోతి): అన్నదాతలకు అన్ని విధాలా మేలుచేసే జీరో బడ్జెట్‌తో కూడిన ప్రకృతి వ్యవసాయమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్లపల్లెకు చెందిన మునగాల ద్వారకానాథరెడ్డి, మునగాల వెంకటరమణారెడ్డి 17 ఎకరాల్లో పంటలు, పశుపోషణ, కోళ్లు, చేపల పెంపకం సాగుచేస్తున్న ప్రకృతి వ్యవసాయక్షేత్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. తానొక్కరే రైతు కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రమంతా గంటపాటు కలియతిరిగారు. వారితో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుతూ వ్యవసాయ పద్ధతులు, దిగుబడులు, లాభాలను అడిగి తెలుసుకున్నారు. పచ్చని వ్యవసాయ వాతావరణాన్ని ఆస్వాదించారు. మొదట పంట పొలాలకు వాడుతున్న సేంద్రియ ద్రావకాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందారో అడిగి తెలుసుకున్నారు. క్షేత్రంలో సాగుచేస్తున్న పండ్ల రకాలపై ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి తమకు బిందు సేద్యం, జిప్సం, నీటికుంట.. సబ్సిడీ రూపంలో ఇచ్చారని రైతులు తెలిపారు. మామిడి, ఉసిరి, సపోటా, చీనీ, నిమ్మ, నేరేడు, వాటర్ ఆపిల్, రామ-లక్ష్మణ, సీతాఫలం, కొబ్బరి, జామ తదితర 14 రకాల పండ్ల చెట్లను సాగుచేస్తున్నట్లు చెప్పారు. మామిడి చెట్లకు కాసిన పండ్లకు కట్టిన కవర్ల గురించి లోకేశ్ అడిగారు. ఇవి నాణ్యంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. బాగా ఉన్నాయని రైతులు తెలిపారు. చల్లని చెట్ల కింద కూర్చుని వారిచ్చిన మామిడి పండ్లను ఆరగించారు. 32 లక్షల లీటర్ల సామ ర్థ్యం గల నీటి కుంటను పరిశీలించారు. క్షేత్రంలో పెరుగుతున్న కోళ్లు, బాతులు, గొర్రెల గురించీ ఆయన ఆరా తీశా రు.
కోళ్ల వల్ల పంటలకు తెగుళ్లు రావని, కలుపు కూడా తగ్గుతుందని, ఒక ఆవుతోనే 20 ఎకరాల వరకు సేంద్రియ సాగు చేపట్టవచ్చని రైతులు వివరించారు. పండ్ల తోటలకు వచ్చే వివిధ రకాల తెగుళ్లు, రోగాలను డ్రోన్స్‌తో పసిగట్టే విధంగా తాము ప్రయోగాలు చేస్తున్నట్లు రమణారెడ్డి కుమార్తె జ్యోతి లోకేశ్‌కు చెప్పారు. డ్రోన్ చెట్లపై తిరుగుతుండగానే ఏవైనా తెగుళ్లు ఉంటే వెంటనే ఫోన్‌కు మేసేజ్ వచ్చేలా టెక్నాలజీని పెంపొందిస్తున్నట్లు తెలిపారు. రైతు లు నష్టపోకుండా జొమోటో, స్విగ్గీలతో జట్టుకట్టి పండ్ల వ్యాపారం చేస్తే బాగుంటుందని.. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని రైతు కుమారుడు విఘ్నేశ్వర్‌రెడ్డి కోరారు. ఒక్క మామిడి పంటతోనే ఏటా రూ.3.50 లక్షలు ఆర్జిస్తున్నట్లు మంత్రికి వివరించారు.
లోతుగా సమాచార సేకరణ
మంత్రి లోకేశ్ వ్యవసాయ క్షేత్రంలో అధిక సమయం గడిపారు. ప్రకృతి వ్యసాయాన్ని లాభసాటిగా ఎలా చేయాలనే లోతైన సమాచారం రాబట్టారు. రాయలసీమను ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్దాలనే తన పాదయాత్ర హామీకి అనుగుణంగా వివరాలు తెలుసుకున్నారు.రైతులను ప్రకృతి వ్యవసాయం, చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. బిందుసేద్యానికి, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి కి కూడా ప్రభుత్వం చేదోడుగా ఉందన్నారు. అనంతరం ఆయనకు రైతులు మామిడి పండ్లను బహూకరించారు. లోకేశ్ ఆ కుటుంబ సభ్యులతో గ్రూఫ్‌ఫొటో తీసుకున్నారు. ఏఅవసరమొచ్చినా తన వాట్సాప్‌కు మెసేజ్ పెట్టాలన్నారు.