సవాళ్లను స్వీకరించి ఉన్నత స్థానాలకు ఎదగాలి
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:35 AM
జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ, మార్పులకు అనుగుణంగా ప్రయాణం సాగించడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగాలని పీఎల్ (ప్రభుదాస్ లిల్లాధర్) క్యాపిటల్ గ్రూపు సీఈవో జరీన్ దారువాలా పేర్కొన్నారు.
ఐఐఎంవీ స్నాతకోత్సవంలో పీఎల్ క్యాపిటల్ గ్రూపు సీఈవో జరీన్ దారువాలా
విశాఖపట్నం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జీవితంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ, మార్పులకు అనుగుణంగా ప్రయాణం సాగించడం ద్వారా ఉన్నత స్థానాలకు ఎదగాలని పీఎల్ (ప్రభుదాస్ లిల్లాధర్) క్యాపిటల్ గ్రూపు సీఈవో జరీన్ దారువాలా పేర్కొన్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) పదో స్నాతకోత్సవాన్ని శనివారం ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలె్‌సలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ మార్పును జీవితంలో ఎల్లప్పుడూ భాగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చునన్నారు. సమస్యల్లో చిక్కుకోకుండా పరిష్కార మార్గాలపై దృష్టిసారించాలన్నారు. ఐఐఎంవీ గవర్నింగ్ బోర్డు చైర్‌పర్సన్ అండ్ జుబిలెంట్ గ్రూపు వ్యవస్థాపకులు హరి ఎస్ బార్టియా మాట్లాడుతూ టెక్నాలజీతో ఆర్థిక మోడళ్లు రూపొందించడం, నివేదికలు సిద్ధం చేయడం సులభతరమైందని, కాబట్టి, ప్రస్తుతం విద్యార్థుల దృష్టి ఏం తెలుసునన్న దానిపై కాకుండా ఎలా ఆలోచిస్తాం, ఎలా ప్రశ్నిస్తాం, ఎలా నిర్ణయాలు తీసుకుంటామన్న దానిపై ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐఐఎంవి డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ గత దశాబ్ద కాలంలో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.