Share News

వైసీపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 12 , 2026 | 06:01 AM

ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో దాడికి గురైన ఎస్టీ మహిళా విభాగం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

వైసీపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం

  • పార్టీ నుంచి బయటకు పంపేందుకు కుట్రపన్నారంటూ సెల్ఫీ వీడియో

  • అసభ్యంగా ప్రవర్తించిన వారినే ప్రోత్సహించారంటూ రవిబాబు, శంకర్‌పై ఆరోపణలు

  • ప్రసన్నను పరామర్శించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో దాడికి గురైన ఎస్టీ మహిళా విభాగం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షురాలు పేరం ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇటీవల జరిగిన పరిణామాలతోపాటు పార్టీ వాట్సాప్‌ గ్రూపుల నుంచి తనను తొలగిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసిన ప్రసన్న, నిద్ర మాత్రలు మింగారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ఈనెల 8న ఒంగోలులోని వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో వైసీపీ మహిళా నాయకురాలు మేరీ కుమారి, ఆమె భర్త శివకుమార్‌ ప్రసన్నపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత తన తల్లిపై దాడి చేసిన శివకుమార్‌పై ప్రసన్న కుమారుడు మదన్‌కుమార్‌ తన స్నేహితులతో కలసి ప్రతిదాడి చేశారు. దీనిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వ్యవహారం రచ్చకెక్కడంతో ప్రసన్నను వైసీపీ గ్రూపుల్లోనుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు తొలగించారు. దీంతో ప్రసన్న మనస్తాపానికి గురై పార్టీలో జరుగుతున్న అన్యాయంపై సెల్ఫీ వీడియో తీస్తూ నిద్ర మాత్రలు మింగారు. ఆ వీడియోలో ఒంగోలు వైసీపీ ఇన్‌చార్జీ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు శంకర్‌పై ఆరోపణలు చేశారు. గిరిజన మహిళను లక్ష్యంగా చేసుకొని వేధించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఏడాదిగా నన్ను మానసికంగా క్షోభకు గురిచేస్తున్నా పార్టీ కోసం పనిచేస్తున్నా. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తులను ప్రోత్సహిస్తూ నన్ను అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేను ఈ విషయాలన్నింటినీ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా’ అని ప్రసన్న ప్రకటించారు. కాగా ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న మహిళ కమిషన్‌ చైర్‌ పర్సన్‌ రాయపాటి శైలజ శనివారం రిమ్స్‌ ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఘటన జరిగిన తీరును, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 06:02 AM