Sajjala Ramakrishna Reddy: అమరావతిని వైసీపీ స్వాగతిస్తుంది
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:34 AM
అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
జగన్ ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదు: సజ్జల
అమరావతి, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాము ఎప్పుడూ అమరావతిని తక్కువ చేయలేదని, విశాఖలో సీఎం కూర్చుంటే మరింత అభివృద్ధి చెందేందుకు వీలుందని మాత్రమే చెప్పామని అన్నారు. శనివారం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘జగన్ ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. పైగా అభిమానిస్తారు. ఈ ప్రాంతంలో భాగస్వామి అవుతారనేందుకు 2019కి ముందే ఇక్కడ ఇల్లు కట్టుకోవడం, పార్టీ ఆఫీసు నిర్మించడమే నిదర్శనం. చంద్రబాబు చెప్పినట్లుగా అమరావతి రాజధానిని జగన్ ఆమోదించి... ఇక్కడే ఉండాలనుకున్నారు. అమరావతిని ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు’’ అని సజ్జల పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఒక ప్రశ్న లేవనెత్తామని, దీనికి సమాధానం చెప్పకుండా విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ‘‘అమరావతిలో అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడంలో తప్పేముంది? బాబు చేస్తున్న స్కామ్‌లనే ప్రశ్నిస్తున్నాం. జగన్ ఇల్లు ఉన్న ఏరియా, అమరావతి ఒక్కటే అయినా... అమరావతిలో నీళ్లుతోడటానికి వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు.