దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
ABN , Publish Date - May 31 , 2026 | 06:35 AM
దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ సానుకూల నివేదికను సమర్పించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌కు వైసీపీ నేతల వినతి
న్యూఢిల్లీ, మే 30(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవులకు న్యాయం జరిగేలా జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ సానుకూల నివేదికను సమర్పించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ కమిషన్‌కు వైసీపీ ప్రతినిధి బృందం శనివారం వినతిపత్రం సమర్పించింది. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు అందుబాటులో ఉన్న అన్ని హక్కులు, రక్షణలు దళిత క్రైస్తవులకు కూడా కల్పించాలని ఎంపీ గురుమూర్తి కోరారు. మతం ఆధారంగా వివక్ష చూపడం ఆగిపోవాలని, దళితుల హక్కుల పరిరక్షణలో సమానత్వంతో, న్యాయంతో వ్యవహరించాలని కేంద్రానికి ఎంపీ గొల్ల బాబూరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీఎంపీ నందిగం సురేశ్ పాల్గొన్నారు.