అసెంబ్లీకి ఒక్కరోజు వైసీపీ
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:06 AM
ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిర్ణయించారు.
రేపు గవర్నర్ ప్రసంగానికి హాజరు
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి నిర్ణయించారు. ఆ రోజు మాజీ సీఎం హోదాలో జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతిస్తారా అంటూ శాసనసభావర్గాలను వైసీపీ నేతలు ఆరా తీసినట్టు తెలిసింది. ఇందుకు శాసనసభ వర్గాలు కూడా సుముఖతను వ్యక్తం చేసినట్టు సమాచారం. 2024 ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, గవర్నర్ ప్రసంగ కార్యక్రమాల కోసం అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ తర్వాత నుంచి శాసనసభా సమావేశాలను బాయ్‌కాట్ చేస్తూ వస్తున్నారు. అయితే, కేంద్రానికి సానుకూల సంకేతాలు పంపించేందుకుగాను ప్రతిసారీ గవర్నర్ ప్రసంగానికి మాత్రం హాజరవుతున్నారు. గవర్నర్ ప్రసంగం రోజును శాసనసభ పని దినంగా గుర్తించరు. అందువల్ల, గవర్నర్‌కు గౌరవం ఇచ్చేలా ఈ కార్యక్రమానికి హాజరైతే, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఎదురు కాబోవని జగన్ భావిస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి గవర్నర్‌తో సఖ్యతను జగన్ కోరుకుంటున్నారని చెబుతున్నారు. అందువల్ల బుధవారం నాటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఉభయసభల సభ్యులూ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత మళ్లీ పాత విధానమే జగన్ కొనసాగిస్తారని అంటున్నాయి.