Share News

వైసీపీ విష వ్యూహాలు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:34 AM

‘జగన్‌-మావిగన్‌’తో జనం చేత ఛీఛీ అనిపించుకుంటున్న వైసీపీ రచ్చ రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ ఊబి నుంచి బయటపడి, జనం దృష్టి మళ్లించేందుకు... ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థలే లక్ష్యంగా విష ప్రచారం చేస్తోంది.

వైసీపీ విష వ్యూహాలు!

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ లక్ష్యంగా వికృత క్రీడ

  • ‘వీకెండ్‌ కామెంట్‌’లో వ్యాఖ్యలపై రాద్ధాంతం

  • ఎండీ రాధాకృష్ణపై వైసీపీ నేతల దూషణలు

  • నేడు ‘ఆంధ్రజ్యోతి’ ఆఫీసుల ముట్టడికి పిలుపు

  • ‘మావిగన్‌’ రచ్చ నుంచి దృష్టి మరల్చే యత్నం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘జగన్‌-మావిగన్‌’తో జనం చేత ఛీఛీ అనిపించుకుంటున్న వైసీపీ రచ్చ రాజకీయాలు మొదలుపెట్టింది. ఈ ఊబి నుంచి బయటపడి, జనం దృష్టి మళ్లించేందుకు... ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి సంస్థలే లక్ష్యంగా విష ప్రచారం చేస్తోంది. వైసీపీ నేతలు సొంత బుర్రలతో ఆలోచించడంలేదని.. జగన్‌ నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా వ్యవహరిస్తున్నారని శనివారం ‘వీకెండ్‌ కామెంట్‌’లో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. జగన్‌ తొలుత అమరావతికి మద్దతు ఇవ్వడం, అధికారంలోకి రాగానే మూడు రాజధానులనడం, ఇప్పుడు ‘మావిగన్‌’ మాటెత్తడం... ప్రతిసారీ వైసీపీ నేతలు గుడ్డిగా సమర్థించడం! ఈ విషయ తీవ్రత తెలిపేలా ‘వీకెండ్‌ కామెంట్‌’లో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ విషం చిమ్ముతోంది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానల్‌లో శనివారం రాత్రి ‘వీకెండ్‌ కామెంట్‌’ ప్రసారమైంది. సోమవారం మధ్యాహ్నం దాకా దీనిపై వైసీపీ నేతలు స్పందించలేదు. పైగా... తమ నిస్సహాయ పరిస్థితిని ‘వీకెండ్‌ కామెంట్‌’లో చక్కగా వివరించారంటూ వైసీపీ నేతలే అంతర్గతంగా అంగీకరించారు. ‘మావిగన్‌’ దెబ్బ ఇంటాబయటా గట్టిగా తగులుతోందని వైసీపీ పెద్దలకు అర్థమైంది. దీంతో... సోమవారం మధ్యాహ్నం నుంచి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కురసాల కన్నబాబు తదితరులు తెరపైకి వచ్చారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌పై దూషణలకు దిగారు. విచక్షణ కోల్పోయి మాట్లాడారు. దీనిని జగన్‌ సొంత మీడియాతోపాటు కూలి నీలి మీడియాలో ప్రచారంలోకి పెట్టారు. అంతేకాదు... వైసీపీ అధికారంలో ఉండగా ‘ఆంధ్రజ్యోతి’ యాజమాన్యాన్ని లక్ష్యంగా చేసుకుని అప్పుడు చేసిన విష, వికృత పోస్టులను ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు. ఇదంతా చాలదన్నట్లుగా... మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాలను ముట్టడించాలంటూ పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి. హైదరాబాద్‌లోనూ ధర్నాలు చేయాలంటూ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ‘మావిగన్‌’ ఊబిలోంచి బయటపడలేక... జనం దృష్టిని మళ్లించేందుకే ఇదంతా చేస్తున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

Updated Date - Apr 07 , 2026 | 05:35 AM