Share News

పట్టు నిలుపుకున్న వైసీపీ

ABN , Publish Date - Nov 09 , 2026 | 11:20 PM

జిల్లాలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ తమ పట్టును నిలుపుకొన్నది. అలాగే కూటమి పార్టీలు సైతం కాస్త పుంజుకున్నాయి.

పట్టు నిలుపుకున్న వైసీపీ
చింతపల్లి కౌంటింగ్‌ కేంద్రంలో శనివారం ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది

జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి 1,25,436, కూటమికి 1,00,363 ఓట్లు

జిల్లాలో చెల్లని ఓట్లు: 19,152, నోటాకు: 5,408, ఇతరులకు: 58,774

గతంతో పోల్చితే 30 శాతం వరకు కూటమి పార్టీలకు ఓట్లు దక్కాయని అంచనా

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో వైసీపీ తమ పట్టును నిలుపుకొన్నది. అలాగే కూటమి పార్టీలు సైతం కాస్త పుంజుకున్నాయి. జిల్లాలోని 11 మండలాల్లో 617 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 11 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 4,98,465 మంది ఓటర్లకు గాను 3,09,133 మంది ఓట్లు వేశారు. పోలైన ఓట్లలో వైసీపీకి 1,25,436, టీడీపీకి 61,911, జనసేనకు 11,642, బీజేపీకి 26,810, ఇతరులకు 58,774, నోటాకు 5,408, చెల్లనివి 19,152 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు.

ఈ లెక్కను కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థులకు మొత్తం ఓట్లు 1,00,363 లభించాయి. అయితే బ్యాలెట్‌తో పోలింగ్‌ జరిగినప్పటికీ నోటాకు 5,408 ఓట్లు పడడంతో పాటు 19,152 ఓట్లు చెల్లకపోవడం గమనార్హం. గత పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీకి 10 జడ్పీటీసీ స్థానాలు దక్కాయి. తాజా ఎన్నికల్లో 7 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుపొందగా, 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ దక్కించుకోవడం విశేషం. దీంతో గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీడీపీకి 30 ఽశాతం మేరకు ఓట్లు పెరిగాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

వైసీపీకి 88, కూటమికి 64 ఎంపీటీసీ స్థానాలు

జిల్లాలో మొత్తం 172 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 88, టీడీపీ 47, జనసేన 12, బీజేపీ 6, సీపీఎం 2, కాంగ్రెస్‌ 1, స్వతంత్రులు 16 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు. కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులందరికీ కలిపి 64 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. అయితే జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కడా ఏకగ్రీవం కాకపోవడంతో పాటు 16 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎంపీటీసీలుగా విజయం సాధించడం విశేషం.

Updated Date - Nov 09 , 2026 | 11:20 PM