Share News

వైసీపీ ఫ్లాప్‌ షో

ABN , Publish Date - Apr 09 , 2026 | 04:08 AM

బూతులపై పేటెంట్‌ తీసుకుని ఇప్పుడు నీతులు చెబుతున్న వైసీపీ నేతల ఆందోళనలు తుస్సుమన్నాయి. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారంటూ...

వైసీపీ ఫ్లాప్‌ షో

  • తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలకు స్పందించని క్యాడర్‌

  • ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల వద్ద ధర్నాకు

  • భారీ జనసమీకరణకు యత్నించి విఫలం

  • చాలా చోట్ల ముఖం చాటేసిన ముఖ్య నేతలు

  • వారికి లేని ఆందోళన తమకెందుకనుకున్న క్యాడర్‌

  • జగన్‌ మెప్పు కోసం అంబటి, కాకాణి హైడ్రామా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

బూతులపై పేటెంట్‌ తీసుకుని ఇప్పుడు నీతులు చెబుతున్న వైసీపీ నేతల ఆందోళనలు తుస్సుమన్నాయి. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన ‘వీకెండ్‌ కామెంట్‌’లో మహిళలను అవమానించారంటూ నానాయాగీ చేస్తున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల ముందు బుధవారం ధర్నాలకు పిలుపునిచ్చింది. ‘బూతుల పేరిట మనం ఆందోళనలు చేయడమంత బూతు మరొకటి ఉండదు’ అనుకున్నారేమో క్యాడర్‌ దీనిని పట్టించుకోలేదు. వైసీపీ నేతలు పరిమిత సంఖ్యలో వచ్చిన అనుచరులతో ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల ముందు హంగామా సృష్టించేందుకు ప్రయత్నించి...విఫలమయ్యారు. వైసీపీ సీనియర్‌ నేతల్లో పలువురు మంగళవారం హైదరాబాద్‌లోని ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ చానల్‌ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ఇది సరిపోదంటూ బుధవారం ఏపీలోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయాల ముందు ధర్నాలు చేయాలంటూ ‘తాడేపల్లి పెద్దలు’ హుకుం జారీ చేశారు. కానీ... జగన్‌ పిలుపునకు పార్టీ శ్రేణుల నుంచి స్పందన కరువైంది. వెరసి హైదరాబాద్‌లో ప్లాన్‌-ఏ, రాష్ట్రంలో ప్లాన్‌-బీ విఫలం కావడంతో... ప్లాన్‌-సీ కింద గురువారంనాడు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణపై కేసులు పెట్టాలని క్యాడర్‌ను జగన్‌ ఆదేశించారు.

Untitled-1 copy.jpg

అనంతలో తప్పదు అన్నట్టుగా...

అనంతపురంలోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రాంతీయ కార్యాలయం వద్ద వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కార్యాలయానికి కాస్త దూరంగా బైఠాయించి నిరసన తెలిపి వెళ్లిపోయారు. ముఖ్య నాయకులు ఎవరూ రాలేదు.


కర్నూలులో నేతలు ఇళ్లకే పరిమితం..

కర్నూలు జిల్లాలో నిరసనకు పిలుపునిచ్చిన కీలక నాయకులు, ద్వితీయశ్రేణి నాయకులు దూరంగా ఉండిపోయారు. ఇళ్లలోనే ఉండి కార్యకర్తలను ఉసిగొల్పారు. యూనిట్‌ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా వారిని పోలీసులు నిలువరించారు. కర్నూలు సిటీ ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వద్దకు వందమంది దాకా వచ్చి నినాదాలు చేశారు.

నెల్లూరులో టార్గెట్‌ 2 వేలు.. వచ్చింది 200 మందే

నెల్లూరులోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడికి వైసీపీ పిలుపునిచ్చింది. అన్నీ నియోజకవర్గాల నుంచి రెండు వేల మందిని సమీకరించేలా ప్రయత్నాలు చేసింది. మహిళలను ఎక్కువగా తీసుకురావాలని నాయకులకు ఆదేశాలు అందాయి. కానీ తీరా చూస్తే 200 మంది కూడా హాజరుకాలేదు.

ఒంగోలులో దాడి యత్నం విఫలం

ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని త్రోవగుంట వద్ద ఉన్న ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి యూనిట్‌ కార్యాలయంపై దాడికి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఒంగోలు వైసీపీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు కార్యాలయంలోకి దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా, యూనిట్‌ మేనేజర్‌ ఐవీ సుబ్బారావు ఆధ్వర్యంలో సిబ్బంది వారిని రోడ్డుపైనే నిలిపేశారు.

గుంటూరులో అంబటి వన్‌మాన్‌ షో

గుంటూరులో శంకర్‌విలాస్‌ సెంటర్‌లోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమానికి స్పందన కనపడలేదు. 100 మందికి కూడా మించి పాల్గొనలేదు. గుంటూరుసమీపంలోని ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల నుంచి ఇన్‌చార్జిలు మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం మాజీ మంత్రి అంబటి వన్‌మాన్‌ షోలా మారింది.

బాపట్లలో రప్పారప్పా నినాదాలు

బాపట్ల జిల్లాతో పాటు పొరుగు జిల్లాలో ఉన్న అద్దంకి నుంచి కూడా జనసమీకరణ చేసినా మొత్తం 50 మంది కూడా లేరు. జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున సారథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు.ఈ క్రమంలో అడ్డుగా పెట్టిన బారికేడ్లను తొలగించడంతో పాటు పోలీసుల ఎదుటే రప్పారప్పా నినాదాలు చేశారు.


రాజమహేంద్రవరంలో అట్టర్‌ ఫ్లాప్‌

రాజమహేంద్రవరంలో ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సిటీ కార్యాలయ ముట్టడికి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. కొందరు వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో 40 మంది కార్యకర్తలు కార్యాలయం వైపు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా క్రేందమైన అమలాపురంలోని ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ఉన్న సెంటర్‌ వైపునకు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు.

పశ్చిమలో స్పందించని శ్రేణులు

వైసీపీ పిలుపునకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు స్పందించలేదు. ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం వద్దకు ఏ ఒక్క కార్యకర్త కూడా రాలేదు. తణుకు పట్టణంలోని నరేంద్ర సెంటర్‌లో కేవలం ఐదు నిమిషాలు ధర్నా నిర్వహించి వెళ్లిపోయారు.

విశాఖలో మొక్కుబడిగా

విశాఖపట్నం ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ముందు వైసీపీ నిరసన కార్యక్రమం మొక్కుబడిగా జరిగింది. కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లాలోని పార్టీ శ్రేణులంతా హాజరవుతారని నేతలు ముందురోజు ప్రకటించారు. కానీ ఉదయం 10.30 గంటలకు రెండు వందల మందికి మించి కార్యకర్తలు హాజరుకాలేదు.

శ్రీకాకుళంలో విడతలవారీగా

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నిరసన ఫ్లాప్‌ అయ్యింది. ‘ఆంధ్రజ్యోతి’ ఎచ్చెర్ల యూనిట్‌ వద్ద చేపట్టే ధర్నాకు అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళా నాయకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కానీ బుధవారం సాయంత్రం 3.30 గంటలకు, తర్వాత మరో అరగంటకు, ఆ తర్వాత మరో అరగంటకు బ్యాచ్‌ల వారీగా.. 20 మంది చొప్పున వైసీపీ శ్రేణులు రాగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు.

విజయవాడలో ధర్నాకు కూలీలు

విజయవాడలోని ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు హడావిడి చేశాయి. కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు మలుపు వద్దే పోలీసులు అడ్డగించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేయాలని అంతర్గతంగా పార్టీ నాయకులు ఆదేశాలు జారీచేసినా నాయకులు, కార్యకర్తలు స్వల్పంగానే హాజరయ్యారు. అనుకున్న సమయానికి జనాలు రాకపోవటంతో డబ్బులిచ్చి కొంతమంది కూలీలను కూడా రప్పించారు. పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, దేవినేని అవినాశ్‌, మల్లాది విష్ణు తదితరులు ఈ దాడి యత్నంలో పాల్గొన్నారు.


కాకాణి ఓవరాక్షన్‌

నెల్లూరులో ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడికి వైసీపీ పిలుపునివ్వగా, కార్యకర్తలు, మహిళలు స్పందించకపోవడంతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఫ్రస్టేషన్‌లో కనిపించారు. ప్రజాస్వామ్య రీతిలో స్పందించాలని పోలీసులు సూచించగా, వారిపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాకాణి అసభ్యకర పదజాలంతో ‘ఆంధ్రజ్యోతి’ సిబ్బందిని, ఎండీ రాధాకృష్ణను దూషించారు. ‘మగాళ్లయితే రండిరా’ అంటూ చిందులు తొక్కారు. అప్పటికే ఒక్కొక్కరుగా వైసీపీ శ్రేణులు వెళ్లిపోతుండడంతో చేసేది లేక నాయకులంతా వెనుదిరిగారు. చివర్లో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలను తగలబెట్టారు.

కడపలో స్పందన కరువు

వైసీపీ అధినేత జగన్‌ సొంత జిల్లా కడపలో నిరసన పిలుపునకు అంతగా స్పందన రాలేదు. కడప నగరంలోని నాగరాజుపేటలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా కార్యాలయాన్ని వైసీపీ నేతలు ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. 10.30 గంటలకంతా కడపలో నిరసన తెలిపేందుకు మాజీ కార్పొరేటర్లు, ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలంతా రావాలని వైసీపీ నేతలు జనసమీకరణకు ప్రయత్నించారు. అయితే ఉదయం నుంచి మూడు దఫాలుగా కలిసి సుమారు 50 నుంచి 60 మంది మాత్రమే మహిళా కార్యకర్తలు వచ్చారు. వారంతా పది నిమిషాలు కూడా ఉండలేదు.

Updated Date - Apr 09 , 2026 | 04:10 AM