అమరావతికి వ్యతిరేకం కాదు
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:11 AM
రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్షనేతలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్ తెలిపారు.
రాజధాని రైతుల ప్రయోజనాలను బిల్లులో పెడితే మద్దతిస్తాం: వైసీపీ
న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్షనేతలు మిథున్ రెడ్డి, పిల్లి సుభాశ్ చంద్రబోస్ తెలిపారు. ఢిల్లీలో మంగళవారం వారిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అయితే, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడే అంశాలను బిల్లులో పెడితే మద్దతు ఇస్తాం. అమరావతిలో ఇటీవల జరిగిన సమావేశంలో రైతులు తమ సమస్యలను వెల్లడించారు. పోలవరానికి కేంద్రమే పూర్తిగా నిధులివ్వాలి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. ‘జీ-రామ్ జీ’కి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తక్షణమే విడుదల చేయాలి. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ సరికాదు. ఈ అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతాం.’’ అని వారు తెలిపారు. కాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్ అమరావతికి వ్యతిరేకమని చెబుతుండగా, ఆ పార్టీ ఎంపీలు మాత్రం ఢిల్లీలో మద్దతునిస్తామని చెప్పడం గమనార్హం.