Share News

వైసీపీని వీడని ‘11’

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:26 AM

వైసీపీ గత ఎన్నికల్లో రాష్ట్రంలో 11 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచీ ఆ పార్టీ నేతలు 11 అంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనంలోని గదుల కేటాయింపులోనూ...

వైసీపీని వీడని ‘11’

  • పార్లమెంటులో 11వ నంబరు గది కేటాయింపు

  • గదిని మార్చాలంటూ స్పీకర్‌కు ఎంపీల మొర

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ గత ఎన్నికల్లో రాష్ట్రంలో 11 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచీ ఆ పార్టీ నేతలు 11 అంటేనే ఉలిక్కిపడుతున్నారు. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనంలోని గదుల కేటాయింపులోనూ ఆ పార్టీకి 11వ నంబరు గది కేటాయించడంతో వైసీపీ ఎంపీలు కంగుతిన్నారు. ఆ గదిలో అడుగుపెడితే రాజకీయంగా మరింత పతనమైపోతామని వారంతా గగ్గోలుపెట్టినట్లు తెలిసింది. కొత్త పార్లమెంటు భవనంలో రాజకీయ పార్టీలకు కార్యాలయాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా, వైసీపీకి మొదటి అంతస్తులో ఉన్న 11వ నంబరు గదిని స్పీకర్‌ కార్యాలయం కేటాయించింది. ఈ విషయం తెలియగానే వైసీపీ ఎంపీలు షాక్‌కు గురైనట్లు తెలిసింది. తమకు కేటాయించిన గదిని మార్చాలంటూ లోక్‌సభ స్పీకర్‌కు విన్నవించుకున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీల విజ్ఞప్తితో స్పీకర్‌ ఆశ్చర్యపోయారు. 11వ నంబరు గదికి ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించడంతో వారు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ‘‘అధ్యక్షా.. ఏపీ ఎన్నికల్లో మా పార్టీ నుంచి కేవలం 11 మందే గెలిచారు. రాష్ట్రంలో ప్రత్యర్థుల నుంచి ప్రజల వరకూ అందరూ మమ్మల్ని ‘టీమ్‌ 11’ అంటూ గేలి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడా అదే నంబర్‌ గది ఇస్తే మాకు కలిసి రాదు. మేం తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాం’’ అని గోడు వెళ్లబోసుకున్నట్లు తెలిసింది. ఆ గదిని మార్చకపోతే రాజకీయంగా మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని మొరపెట్టుకున్నట్లు సమాచారం. వైసీపీ ఎంపీల విజ్ఞప్తిపై స్పీకర్‌ కార్యాలయం సానుకూలంగా స్పం దించింది. వారి కోరిక మేరకు 11వ నంబరు గదికి బదులుగా దానికి మరొకటి కలిపి పక్కనే ఉన్న 12వ నంబరు (11+1) గదిని కేటాయించింది! కాగా, టీడీపీకి గతంలోనే మొదటి అంతస్తులో 9వ నంబరు గదిని కేటాయించింది.

Updated Date - Mar 25 , 2026 | 05:27 AM