నోరు విప్పితే ఒట్టు!
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:17 AM
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ మూడోరోజు కూడా సిట్ విచారణకు సహకరించలేదని తెలిసింది.
సిట్ విచారణకు సహకరించని ఏ2 లక్ష్మీదుర్గ
కాకినాడ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ మూడోరోజు కూడా సిట్ విచారణకు సహకరించలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అన్నట్టుగా ఉండిపోగా, మరికొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలినట్టు సమాచారం. కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏ2గా ఉన్న లక్ష్మీదుర్గ మూడోరోజు బుధవారం కాకినాడ ఎస్‌డీపీవో కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. విచారణలో సిట్ అధికారులు ‘డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్‌బాడీని వాళ్ల ఇంటికి ఎందుకు తీసుకువెళ్లారు? ఈ హత్య క్షణికావేశంలో చేసిందా? లేక ముందు నుంచి డ్రైవర్‌ను హెచ్చరిస్తూ వచ్చారా? డ్రైవర్ హత్య సమయంలో, అంతకుముందు ఏం జరిగింది? హత్య అనంతరం మీకు, మీ భర్త అనంతబాబు మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? ఈ డోర్ డెలివరీ ఐడియా ఎవరిది? డెడ్‌బాడీని కారులో ఎక్కడెక్కడికి తీసుకువెళ్లారు?’ అని ప్రశ్నించారు. మూడోరోజైనా కొంత కీలక సమాచారం ఆమె నుంచి వస్తుందని సిట్ అధికారులు భావించినా.. సమాధానం రాలేదని అంటున్నారు. గురువారం ఉగాది కావడంతో మధ్యాహ్నం వరకు విచారించి విడిచిపెట్టారు.