ఎందుకా డైటు? ఏమిటా కథ?
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:56 AM
ఏ వ్యాధి ఉందో తెలుసుకోవాలంటే ముందు రక్త పరీక్షలు చేయాలి. వ్యాధిని నిర్ధారించాకే ఏ మందులు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయిస్తారు. కానీ...
అనంతబాబు ఆహారంపై సర్వత్రా చర్చ
క్షయ, ఎయిడ్స్‌లాంటివి ఉంటే హై ప్రొటీన్ డైట్
రక్త పరీక్షలు కూడా చేయకుండానే వైద్యుల సిఫారసు
బ్లడ్ టెస్టులకు అంగీకరించని వైసీపీ ఎమ్మెల్సీ
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
ఏ వ్యాధి ఉందో తెలుసుకోవాలంటే ముందు రక్త పరీక్షలు చేయాలి. వ్యాధిని నిర్ధారించాకే ఏ మందులు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిర్ణయిస్తారు. కానీ... రక్త పరీక్షలు చేయకుండానే, ఏ వ్యాధి ఉందో చెప్పకుండానే వైద్యులు హై ప్రొటీన్ డైట్ సిఫారసు చేసేశారు! అదీ ఓ సంచలనాత్మక కేసులో జైలులో ఉన్న రిమాండు ఖైదీ విషయంలో! దళిత డ్రైవరు హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు కాకినాడ వైద్యులు ప్రత్యేకంగా హైప్రొటీన్ డైట్ సిఫారసు చేశారు. సాధారణంగా క్షయ, హెచ్‌ఐవీ వంటి తీవ్ర రుగ్మతలున్న రోగులకు వైద్యులు ఇలాంటి ఆహారాన్ని సిఫారసు చేస్తారు. అంతకుముందు... తనకు ఎముకలు, నరాల వ్యాధి, గ్యాస్ట్రిక్ రుగ్మతలు ఉన్నాయని, జైలులో ప్రత్యేక సదుపాయాలతో పాటు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని అనంతబాబు కోర్టులో పిటిషన్ వేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆయనకు అసాధారణ ఇబ్బందులేమీ లేవని, ప్రత్యేక వసతులు, డైట్‌కు అర్హమైన ఆరోగ్య సమస్యల్లేవని తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఇక్కడ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేకపోవడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి సిఫారసు చేయాలనే పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. కాకినాడలో కూడా గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ లేరని చెబుతున్నారు. దీంతో మెడికల్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ వి.కిరణ్, ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డి.రాజ్ కిశోర్, సైకోథెరపిస్ట్ సాయినాథరావు, డైటీషియన్ ఎ.సురేంద్రబాబుతో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతబాబుకు హైప్రొటీన్ డైట్ అవసరమని ఆ బృందం నివేదిక ఇచ్చేసింది. కీలక విషయం ఏమిటంటే.. రాజమహేంద్రవరం ఆస్పత్రిలోనూ, కాకినాడలోనూ రక్తపరీక్షలకు అనంతబాబు అంగీకరించలేదు. అయినప్పటికీ...దేనిఆధారంగా హైప్రొటీన్ డైట్‌కు సిఫారసు చేశారన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. డైట్‌ను అనుమతించడంపై గురువారం కోర్టు నిర్ణయం వెల్లడించనుంది.