అనంతబాబుపై మరో అట్రాసిటీ కేసు
ABN , Publish Date - May 07 , 2026 | 03:48 AM
డ్రైవరు హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు మరో అట్రాసిటీ కేసును నమోదుచేశారు.
దళిత సాక్షిని బెదిరించిన కేసులో నమోదు
పోలీసు విచారణలోనూ అదే మొండితనం
తెలీదు..సంబంధం లేదని ముక్తసరి జవాబు
ఇక ఆధారాల సాయంతో ముందుకెళ్తాం: పోలీసులు
తిరిగి రాజమండ్రి జైలుకు అనంతబాబు
కాకినాడ, మే 6 (ఆంధ్రజ్యోతి): డ్రైవరు హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు మరో అట్రాసిటీ కేసును నమోదుచేశారు. ఈ కేసులో దళిత సాక్షిని బెదిరించిన వ్యవహారంలో ఆయనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. మరోవైపు, హత్య కేసుతోపాటు సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును విచారించిన పోలీసులకు చేదు అనుభవమే ఎదురైంది. ఈ కేసులో ఆయనతో పాటు కాకినాడ రూరల్ మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కడియాల చిన్నబాబు, కడియాల సతీశ్, మాగంటి రాంబాబు నిందితులు. తాజాగా ప్రత్తిపాడుకు చెందిన లాయర్, అనంతబాబు కుటుంబానికి సన్నిహితుడు చక్కపల్లి శ్రీనివాసరావును పోలీసులు ఏ5గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ కేసులో గత నెల 24న అనంతబాబును అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు అనుమతితో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం తొమ్మిది గంటల వరకు విచారించారు. మొత్తం 47 ప్రశ్నలు అడిగారు. తెలియదు.. గుర్తు లేదు.. నాకు సంబంధం లేదంటూ విచారణకు అనంతబాబు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. చాలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనముద్రలో ఉన్నారని సమాచారం. చివరకు ఫోన్ కీ వర్డ్ చెప్పడానికి కూడా నిరాకరించారని తెలిసింది. దీంతో ఆయన ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నట్టు పోలీసులు తెలిపారు. తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం ఇకపై ఈ కేసులో ముందుకు వెళ్లనున్నట్టు పేర్కొన్నారు. విచారణ గడువు ముగియడంతో ఆయనను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు తిరిగి అనంతబాబును జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.