మొదలైన అనంతబాబు వేట
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:27 AM
డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తమిళనాడు....
ఐదు పోలీసు బృందాల ఏర్పాటు
కాకినాడ నుంచి పరారైనట్టు నిర్ధారణ
బయట రాష్ట్రాలకు రెండు బృందాలు
బెయిల్ రద్దు కోసం కోర్టులో పిటిషన్
కాకినాడ, రాజమహేంద్రవరం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తమిళనాడు, తెలంగాణ, ఒడిశాలో వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తనకు వ్యతిరేకంగా ఉన్న సాక్షులను ప్రభావితం చేసి అనంతబాబు అడ్డంగా దొరికిపోయారు. నలుగురు సాక్షులను తన అనుచరుల ద్వారా బెదిరించి వారికి అనంతబాబు డబ్బులు ముట్టజెప్పారు. తీరా సాక్షులు భయపడి పోలీసులను ఆశ్రయించడంతో అనంతబాబు సహా నలుగురిపై తాజాగా కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అనంతబాబును అరెస్ట్ చేయడం కోసం పోలీసులు రంగంలోకి దిగారు. రెండు బృందాలు సాంకేతిక ఆధారాల ద్వారా ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా, మరో రెండు బృందాలు బయట రాష్ట్రాలకు తరలివెళ్లాయి. మరో పోలీసు బృందం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జల్లెడ పడుతుంది. ఈ క్రమంలో అనంతబాబు మంగళవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో కాకినాడలోని తన నివాసం నుంచి బైక్‌పై పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వేరే రాష్ట్రం పారిపోయారా?లేదా ఉమ్మడి జిల్లాలో ఇంకెక్కడైనా దాక్కున్నారా? అనేది నిర్ధారించుకునేందుకు కీలక మార్గాల్లో అన్ని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదిలాఉండగా, డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి రాజమహేంద్రవరం ట్రయిల్ కోర్టులో శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. దీనికి ఏ1 అనంతబాబు హాజరుకావలసి ఉంది. ఒకవేళ హాజరుకాకపోతే బెయిల్ రద్దయ్యే వీలుంది.
బెయిల్ రద్దు కోసం పిటిషన్
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అనంతబాబుకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆ షరతుల్లో సాక్షులను ప్రభావితం చేయడం, భయపెట్టడం చేయకూడదనేది ముఖ్యమైనది. అయితే కేసు విచారణ పదిరోజుల్లో ఉండగా, కీలక సాక్షులుగా ఉన్న వాళ్లను సాక్ష్యం చెప్పవద్దని బెదిరిస్తూ అక్రమంగా అనంతబాబు నిర్బంధించారు. తాను చెప్పినట్లే కోర్టులో సాక్ష్యం చెప్పాలంటూ నలుగురికీ రూ.4లక్షలు ఇచ్చినట్లు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేయగా ఆ విషయాలు నిజమని వారు ఒప్పుకొన్నారు. ఆ సొమ్మును పోలీసులకు వాళ్లు అందజేశారు. దీనిపై నమోదు చేసిన కేసులో అనంతబాబు మొదటి నిందితుడిగా ఉన్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లగా అనంతబాబు పారిపోయారు. ఈ నేపథ్యంలో అనంతబాబు బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును స్పెషల్ పీపీ కోరారు. ఈ నెల 24న దీనిపై వాదనలు వినేందుకు కోర్టు అంగీకరించింది.