నేడు శ్రీవారి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:46 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని...
మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ భేటీలు
జూమ్ కాన్ఫరెన్సులో కూటమి నేతల నిర్ణయం
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేసిన మహాపచారంపై శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వేంకటేశ్వరుడి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణలు చేయాలని కూటమి పక్షాలు నిర్ణయించాయి. దీనిపై ప్రజల్లోకి వెళ్లాలని.. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి నేతలు విలేకరుల సమావేశాలు నిర్వహించి దేవదేవుడికి జరిగిన అపచారాన్ని వివరించాలని.. ఇదే సమయంలో మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు కూడా నిర్వహించాలని నిశ్చయించాయి. వైసీపీ సభ్యుల తీరుపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం కూటమి పక్షాల మంత్రులు, నేతలతోపాటు పార్టీ అధ్యక్షులు జూమ్ కాన్ఫ్‌రెన్సు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడు, అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్సీ సోమువీర్రాజు., జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దేవుడిపై రాజకీయం బూమరాంగ్
దేవదేవుడి బొమ్మతో వైసీపీ చేసిన రాజకీయం బూమరాంగ్ అయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. చెప్పులు, బూటు కాళ్లతో స్వామి పోస్టర్లు పట్టుకుని ప్రదర్శన చేయడంపై భక్తుల నుంచీ ఆగ్రహం వ్యక్తం కావడంతో జగన్ అండ్ కో ఆత్మరక్షణలో పడ్డారని చెబుతున్నాయి. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో వైసీపీ నేతలు కూరుకుపోయారని.. దీనినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు హెరిటేజ్ సంస్థను ఇరికించడానికి చేసిన ప్రయత్నాలు ఘోరంగా దెబ్బతినడం.. ఢిల్లీ హైకోర్టు జగన్ రోత మీడియాపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఎదురుదాడికి యత్నించి భంగపడ్డారని స్పష్టం చేస్తున్నాయి.