వైసీపీ నీచ రాజకీయం
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:51 AM
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు శనివారం ఆరోపించారు.
పథకం ప్రకారమే మతవిశ్వాసాలపై దాడి
దేవుడి ఫొటోలు విసిరేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు
కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల ధ్వజం
వైసీపీ నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు శనివారం ఆరోపించారు. చెప్పులు, బూట్లు వేసుకొని శ్రీవారి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తూ మహాపచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేశ్ మీడియాతో మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ నీచ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. వైసీపీ విధ్వంసకర విధానాలకు వ్యతిరేకంగా వారం రోజుల పాటు ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. శాసనమండలిలో శ్రీవారికి ఘోర అపచారం జరగడం యాదృచ్ఛికం కాదని, అది ఒక ప్రణాళిక ప్రకారం మతవిశ్వాసాలు, హిందూ ఆచారాలు, సంప్రదాయాలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు. దేవుడి ఫొటోలు విసిరేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని, సాక్ష్యాలు ఉన్నప్పటికీ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఓ ప్రణాళిక ప్రకారమే కుట్రపూరితంగా, ద్వేషపూరితంగా వ్యవహరించారని దుయ్యపట్టారు. కాగా, అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ భగవంతుడి ఫొటోలతో ఎవరూ ఇంత అవమానకరంగా ప్రవర్తించలేదని, వైసీపీ వాళ్లకు దేవుడంటే భయం, భక్తి లేవని, హిందుత్వాన్ని కించపరచడమే వారి నైజమని ధ్వజమెత్తారు.
హిందువుల మనోభావాలతో మాజీ సీఎం జగన్ చెలగాటం ఆడుతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరులో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై ఉన్న కేసుల్లోని సాక్షులు ఎలా చనిపోతున్నారో అర్థం కావడంలేదన్నారు. పరకామణి కేసులో సాక్షిగా ఉన్న అధికారి ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారిపై జగన్‌కు నమ్మకం లేదని, ఏనాడూ డిక్లరేషన్ కూడా ఇవ్వలేదని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆరోపించారు. క్రికెట్ మ్యాచ్ చూడటానికి సొంత డబ్బుతో కొలంబో వెళ్లిన మంత్రి లోకేశ్‌ను వైసీపీ నాయకులు విమర్శించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తాడేపల్లి నుంచి తెనాలి వెళ్లడానికి కూడా హెలికాప్టర్ వాడిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం ఎంతవరకు సబబని కొల్లు ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి విషయంలో వైసీపీ నాయకుల తీరు దారుణంగా ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని సంకల్‌బాగ్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కర్నూలు అర్బన్ అండ్ డెవల్‌పమెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి ఆలయంలో సంప్రోక్షణ చేపట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చేసిన తప్పును జగన్ ఒప్పుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. వైసీపీ అధ్యక్షుడిగా జగన్‌ను మార్చి ఇం కొకరిని ఎన్నుకోవాలని, అప్పుడైనా ముఖ్యమైన అంశాలపై చర్చలు జరిగేందుకు అవకాశం ఉంటుందేమోనని అభిప్రయపడ్డారు. 2039 వరకు కూట మి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని సీనియర్ ఐఏఎస్‌లు తనతో చెప్పారని, కూటమి పాలన ఎంత బాగుందో దీన్నిబట్టి తెలుస్తోందని మంత్రి భరత్ పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్‌కు గానీ, ఆ పార్టీ నాయకులకు గానీ దేవుడంటే భయం, భక్తి లేవని, అందుకే రాజకీయ లబ్ధి కోసం ఆ దేవుడిని కూడా చట్ట సభలకు తీసుకువచ్చి సంప్రదాయాలను మంటగలుపుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో మండిపడ్డారు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి ఘోరమైన తప్పు చేసింది కాక హిందూ మత ఆచారాలను మంటగలిపేలా వ్యవహరించడం జగన్‌లోని రాక్షసత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కాగా, మండలిలో శ్రీవారి చిత్రపటాన్ని కింద పడేసినట్లు నిరూపిస్తే తాము రాజీనామా చేస్తామని వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ రావు సవాల్ విసిరారని టీటీడీ బోర్డు సభ్యుడు, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మండలిలో దేవదేవుడి చిత్రపటాన్ని కింద పడేసి వెళ్లిపోతున్న ఫొటోలను ఎమ్మెల్యే ప్రదర్శించారు. వైసీపీ వారు చేసిన సవాల్‌ను స్వీకరించి, దమ్ముంటే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.