జగన్ డైరెక్షన్‌లోనే!
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:42 AM
జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చె ప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తూ అపహాస్యం చేశారని, మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు.
చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తారా?
తమ విధానం ఇదేనని జగన్ చెబుతున్నారా?
హిందువుల మనోభావాలు దెబ్బతీశారు.. క్షమాపణలు చెప్పాలి
మంత్రులు పయ్యావుల, దుర్గేశ్, సవిత, ఎమ్మెల్సీ వీర్రాజు డిమాండ్
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జగన్ డైరెక్షన్‌లోనే వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చె ప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్లకార్డుల్లా ప్రదర్శిస్తూ అపహాస్యం చేశారని, మహాపచారానికి పాల్పడ్డారని కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా శ్రీవారి ఫోటోలను విసిరిపడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఆ దేవదేవుడే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ మహాపచారంపై జగన్, వైసీపీ సభ్యులు హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మంత్రి లోకేశ్ నేతృత్వంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడారు.
మనోభావాలు దెబ్బతీశారు: పయ్యావుల
వైసీపీ సభ్యులు చట్టసభల సాక్షిగా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, హద్దులు దాటి ప్రవర్తించారని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. దేవుడిని రాజకీయాల్లో వాడుకోవడంలో వైసీపీ పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు. ‘రాజకీయాల్లో ఎంత దూరమైనా పోవచ్చు. ఏ ఎత్తుగడలైనా వేయవచ్చు కానీ.. ప్రత్యక్ష దైవంగా కొలిచే వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి తీసుకురావడం అంటే వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో సమాజం ఆలోచించుకోవాలి’ అని పేర్కొన్నారు. రోడ్డు మీద స్వామి ప్రసాదం ఇస్తే.. చెప్పులు వదిలేసి తీసుకునే సంస్కృతి మనదని పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు సభలో చేసిన చర్య హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేదిగా తాము భావిస్తున్నామన్నారు. ఇదే దేవదేవుని పట్ల వైసీపీ విధానమా? అని ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామి పట్ల, హిందూత్వం పట్ల తమపార్టీ విధానం ఏంటో జగన్ స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. జగన్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు.
అత్యంత దుర్మార్గం: కందుల
వైసీపీ సభ్యులు వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ప్లకార్డులా పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గమని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. వైసీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపర్చిందని, దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలపై గౌరవం లేని వైసీపీ నాయకత్వం.. దేవుడిని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దుర్మార్గమన్నారు. స్వామి చిత్రపటాలను సభలోకి తీసుకురావడమే కాకుండా, తిరిగి వెళ్లేటప్పుడు వాటిని టేబుళ్లపైకి విసిరేయడం వారి అహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ఈ ఘటనను మండలి చైర్మన్ తీవ్రంగా పరిగణించాలని కోరారు. ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించకపోతే, భవిష్యత్తులో మరిన్ని అపచారాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.
వెంకన్న ఆగ్రహానికి గురికాక తప్పదు: సవిత
వైసీపీ సభ్యులు వెంకన్న ఫోటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, దీనికి ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని బీసీ సంక్షేమ మంత్రి సవిత హెచ్చరించారు. జగన్, వైసీపీ సభ్యులు తక్షణమే హిందువులకు, ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దేవుడి ఫోటోలతో రాజకీయం చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు మహిళలన్నా గౌరవం లేదని, దేవుడన్నా భయం లేదన్నారు. సమస్యలపై చర్చించకుండా, తప్పులు బయటపడకుండా వైసీపీ సభ్యులు ఎంతటి నీచానికైనా దిగజారతారన్నారు.
క్షమించరాని నేరం: సోము వీర్రాజు
చెప్పులేసుకుని దేవుడి ఫొటోలతో సభలోకి రావడం క్షమించరాని నేరమని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. దేవుడి ఫొటోలను విసిరేయడం అవమానకరమన్నారు. ఇదంతా వైసీపీ సభ్యులకు పై నుంచి వచ్చిన డైరెక్షన్‌లోనే జరిగిందని తాను భావిస్తున్నానన్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఒక్క పింఛనూ తొలగించలేదు
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పింఛనూ తొలగించలేదని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పింఛన్లు, రుణాలపై జగన్ నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి, ప్రజల్లో అపోహలు, భయాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 నెలల్లో మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు.