Share News

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని.. ఎందుకు చంపారు.. ఎలా చంపారు?

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:59 AM

‘కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కారణమేంటి? అంత కర్కశంగా చంపి డోర్‌ డెలివరీ చేయాల్సిన అవసరం ఏముంది? డ్రైవర్‌ హత్యలో మీ పాత్ర ఎంత? చంపే సమయంలో దగ్గరే ఉన్నారు కదా!

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని.. ఎందుకు చంపారు.. ఎలా చంపారు?

  • వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను 6 గంటలు ప్రశ్నించిన సిట్‌

  • హైకోర్టు ఆదేశాలతో అధికారుల ముందు హాజరు

  • డ్రైవర్‌ హత్యలో మీ పాత్ర ఎంత?

  • చంపేటప్పుడు దగ్గరే ఉన్నారు కదా!

  • హత్యకు మీరు, మీ భర్త ముందే ప్లాన్‌ వేశారా?

  • చంపాల్సిన అవసరమేంటి?

  • డోర్‌ డెలివరీ ఎందుకు చేశారు?

  • ఏ-2 లక్ష్మీదుర్గపై ప్రశ్నల వర్షం

కాకినాడ, మార్చి 16(ఆంధ్రజ్యోతి): ‘కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు కారణమేంటి? అంత కర్కశంగా చంపి డోర్‌ డెలివరీ చేయాల్సిన అవసరం ఏముంది? డ్రైవర్‌ హత్యలో మీ పాత్ర ఎంత? చంపే సమయంలో దగ్గరే ఉన్నారు కదా! తొలిసారి విచారణలో హత్య సమయంలో ఆస్పత్రిలో ఉన్నట్లు ఎందుకు అబద్ధం చెప్పారు? హత్యకు మీరు, మీ భర్త ముందే ప్లాన్‌ వేశారా’ ..అని సిట్‌ అధికారులు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గపై ప్రశ్నలవర్షం కురిపించారు. ఈ కేసులో ఏ-2గా ఉన్న ఆమె.. హైకోర్టు ఆదేశాలతో సోమవారం సిట్‌ అధికారుల ముందు హాజరయ్యారు. ఏఎస్పీ, ఎస్‌డీపీవో మనీశ్‌ దేవరాజ్‌ పాటిల్‌ ఆమెను ప్రశ్నించారు. డ్రైవర్‌ హత్య అనంతరం కాకినాడ శ్రీరామ్‌నగర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ వద్ద సీసీటీవీ ఫుటేజీ.. హత్యకు ముందు, అనంతరం సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డులపైనా లక్ష్మీదుర్గను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విచారణను వీడియోగ్రాఫర్లతో వీడియో, ఆడియో రూపంలో రికార్డు చేశారు. సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్‌ డెలివరీ చేసిన ఘటనలో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య పాత్ర ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆమెను ఏ-2గా చేర్చి రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై కోర్టు జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంటును కొట్టివేయాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. ఈ నెల 30 వరకు సిట్‌ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. దీంతోనే సోమవారం కాకినాడలో జరిగిన సిట్‌ విచారణకు లక్ష్మీదుర్గ హాజరయ్యారు.


అదే అత్యుత్సాహం..

సామాన్యులెవరైనా తప్పు చేస్తే.. తమదైన శైలిలో విచారణ చేపట్టి, మీడియా ముందు ప్రవేశపెట్టే పోలీసులు దళిత యువకుడిని హత్యచేసి, మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేసిన కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికి మాత్రం రాచమర్యాదలు చేస్తున్నారు. జగన్‌ హయాంలో ఈ హత్య జరగగా.. ఎమ్మెల్సీ అనంతబాబే ఈ హత్య చేశారంటూ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు స్వయంగా మీడియా సమావేశంలో ప్రకటించారు. ఆ సమయంలో ఆయన ‘నిందితుడు అనంతబాబు గారు’ అంటూ పదేపదే సంబోధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినా పోలీసుల్లో మార్పు రాలేదు. సోమవారం సిట్‌ విచారణకు హాజరైన అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు కూడా కాకినాడ జిల్లా పోలీసులు రాచమర్యాదలు చేశారు. సాధారణంగా ఎస్‌డీపీవో కార్యాలయానికి వచ్చేవారు ఎవరైనా తమ వాహనాలను బయట వదిలి లోపలకు నడచుకుంటూ వస్తారు. కానీ లక్ష్మీదుర్గను నేరుగా కారులో ఎస్‌డీపీవో కార్యాలయంలోకి తీసుకెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిందితుల విషయంలో అందరినీ సమానంగా చూడాల్సిన పోలీసులు ఇలా అత్యుత్సాహం ప్రదర్శించడమేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఉదయం పదిన్నర గంటల నుంచి ప్రారంభమైన విచారణలో పది నిమిషాలు బ్రేక్‌ ఇవ్వగా, మధ్యాహ్నం ఒంటి గంటన్నర సమయంలో లంచ్‌ బ్రేక్‌ ఇచ్చారు. ఈ సమయంలో రెండు కేరియర్లలో అనంతబాబు అనుచరులు నేరుగా భోజనాన్ని ఎస్‌డీపీవో కార్యాలయంలోకి పంపారు. ఆమె న్యాయవాదులు ఆ భోజనాన్ని లోపలకు తీసుకెళ్లారు. మధ్యమధ్యలో వాటర్‌ బాటిళ్లను అందజేశారు. ఏ-2కి రాచమర్యాదలు చేయడాన్ని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(అంబేడ్కర్‌) అధ్యక్షుడు, న్యాయవాది పిట్టా వరప్రసాద్‌ ఖండించారు.

Updated Date - Mar 17 , 2026 | 05:00 AM