చివరి రోజూ రచ్చ..రచ్చ..
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:34 AM
గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై శాసనమండలిలో లఘు చర్చ, ప్రభుత్వ ప్రకటన, మంత్రి వివరణ విషయంలో 10 రోజులుగా రచ్చ చేస్తున్న...
‘లడ్డూ’పై ఆనం వివరణకు అడ్డుపడిన వైసీపీ సభ్యులు
పోడియం వద్ద నిరసనలు.. ప్లకార్డుల ప్రదర్శన
అమరావతి, మార్చి6 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై శాసనమండలిలో లఘు చర్చ, ప్రభుత్వ ప్రకటన, మంత్రి వివరణ విషయంలో 10 రోజులుగా రచ్చ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్సీలు చివరి రోజు కూడా ఆందోళనను సాగించారు. ఈ అంశంపై దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వివరణకు పదేపదే అడ్డుపడ్డారు. లడ్డూల తయారీలో నాడు కల్తీ నెయ్యి వినియోగంపై మంత్రి మాట్లాడుతుండగా, వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి, పెద్ద పెట్టున నినాదాలు చేశారు. శుక్రవారం సభలో గురువారం జరిగిన లఘు చర్చకు కొనసాగింపుగా మంత్రి ఆనం వివరణకు చైర్మన్ మోషేన్‌రాజు అనుమతించారు. కల్తీనెయ్యితో మహాపాపం చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఈ సందర్భంగా మంత్రి ఆనం ఆవేదన వ్యక్తం చేశారు.
‘గీతం’ భూములపై వైసీపీ నిరసన
గీతం యూనివర్సిటీ రూ.5వేల కోట్ల భూ దోపిడీపై చర్చించాలని శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. దానిని చైర్మన్ మోషేన్‌రాజు తిరస్కరించి, ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తూ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం బల్లలను చేతులతో చరుస్తూ పెద్ద శబ్దం చేశారు. వైసీపీ సభ్యుల నిరసనలతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. ఆ సమయంలో మంత్రి లోకేశ్ స్పందిస్తూ, వైజాగ్‌లో ఎవరేం చేశారో అన్నీ చర్చిద్దాం అని వ్యాఖ్యానించారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై సంవాదం
ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి కేశవ్ ఈ బిల్లు ప్రవేశపెట్టగా, వైసీపీ సభ్యులు మాట్లాడారు. బొత్స మాట్లాడుతూ, బడ్జెట్ అంకెల గారడీ అని విమర్శించారు. ‘‘ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేదు. సొంత ఆదాయార్జనలో రాష్ట్రం 22వ స్థానంలో ఉందని కాగ్ నివేదికే స్పష్టం చేసింది.’’ అని అన్నారు. దీనిపై మంత్రి కేశవ్ జోక్యం చేసుకుంటూ, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘మీ దగ్గరున్న ఆధారాలను ఇవ్వా’లని బొత్సను కోరారు. ఆధారాలిస్తే రాత్రి 7గంటల వరకైనా చర్చిద్దామని పదేపదే కోరారు. అయితే, వాటిని తర్వాత పంపుతామని బొత్స అన్నారు. వెబ్‌సైట్‌లో కాగ్ రిపోర్టులను చూసుకోవచ్చన్నారు. పీ4 ప్రభుత్వ పథకమా అని వ్యంగ్యం ధ్వనించేలా అన్నారు. ‘‘ఫసల్ బీమాకు బడ్జెట్‌లో రూ.254 కోట్లే పెట్టారు. ఉపాధి హామీ పథకానికి కేవలం రూ.8,500కోట్లే కేటాయించారు. పంటల కొనుగోలుకు సరిపడా నిధులు లేవు. సూపర్ సిక్స్ పథకాలకు సరిపడా నిధులివ్వకుండా సూపర్ సక్సెస్ అని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్తోంది’’ అని బొత్స అనగా, కాగ్ రిపోర్టులో ఈ విషయం ఎక్కడుందో చెప్పాలని మంత్రి ఆనం, మంత్రి రవికుమార్ ప్రశ్నించారు. పంటల కొనుగోలుకు ఎవరెంత ఖర్చు పెట్టారో చర్చకు సిద్ధమని మంత్రి కేశవ్ సవాల్ చేశారు. కాసేపు సభ వాయిదా పడ్డాక తిరిగి ప్రారంభం కాగానే బొత్స కొన్ని పత్రాలను చైర్మన్ ద్వారా మంత్రికి అందించారు. ‘వాకౌట్ చేస్తారా? లేక ఉండి, మా సమాధానం వింటారా’ అని కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. కాగా, మంత్రులు రాం ప్రసాద్, లోకేశ్ ప్రతిపాదించిన మోటారు వాహనాల పన్ను విధింపు సవరణ బిల్లు, జేఎన్‌టీయూ సవరణ బిల్లులను మండలి ఆమోదించింది. వేట్లపాలెం పేలుడు ఘటనలో ప్రభుత్వ చర్యలను మంత్రి అనిత వివరించారు.