నువ్వేంటి చెప్పేది?
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:37 AM
శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మీదకు వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు.
మండలిలో సోము వీర్రాజును అడ్డుకున్న వైసీపీ సభ్యులు
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సోము వీర్రాజు మీదకు వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు గొడవ చేస్తుండటంతో వీర్రాజు రెండుసార్లు పోడియం వద్దకు వెళ్లి, చైర్మన్ మోషేన్‌రాజుకు రెండు చేతులెత్తి దండం పెడుతూ.. ‘ప్రభుత్వ వివరణలు వినమనండి. విపక్షాన్ని అదుపు చేయండి. సభను ఆర్డర్‌లో పెట్టండి’ అని కోరారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌పై వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్తుండగా.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై అధికార, ప్రతిపక్ష సభ్యులు వాదనకు దిగారు. మంత్రి ప్రసంగ సమయంలో.. వైసీపీ సభ్యులు కూర్చోవాలని చైర్మన్ కోరుతుండగా, వీర్రాజు మరోసారి చైర్మన్ పోడియం వద్దకు వద్దకు వెళ్లి ‘సభను ఆర్డర్‌లో పెట్టండి. చెప్పింది వినమనండి’ అన్నారు. దీంతో ‘నువ్వేంటి చెప్పేది’ అంటూ వైసీపీ సభ్యుడు బొమ్మి ఇజ్రాయెల్ మండిపడుతూ సోము దగ్గరకొచ్చారు. మరికొందరు వైసీపీ సభ్యులు కూడా ఆయన వెనుకే వచ్చారు. దీంతో టీడీపీ సభ్యులు లేచి వెళ్లి.. వీర్రాజుకు మద్దతుగా నిలబడ్డారు. ఇరుపక్షాల వాగ్యుద్ధంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
వైసీపీ సభ్యులు నాపైకి దురుసుగా వచ్చారు: సోము
వైసీపీ సభ్యులు సభలో తనపైకి చాలా దురుసుగా వచ్చారని వీర్రాజు తెలిపారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ చైర్మన్ వైసీపీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతోందని.. గొడవ మొదలు కాగానే సభను వాయిదా వేస్తున్నారని, ప్రశ్నోత్తరాలను వాయిదా వేయొద్దని పోడియం వద్దకు వెళ్లి ఆయన్ను కోరానని చెప్పారు. చైర్మన్‌ను అడుగుతుండగానే.. వైసీపీ సభ్యులు తనపైకి చాలా దురుసుగా వచ్చారని.. గతంలో ఎన్నడూ సభలో ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికే ఇలాంటి పన్నాగం పన్నారని, లడ్డూ మీద చర్చ జరిగితే సమాధానం చెప్పాల్సి వస్తుందనే వైసీపీ సభ్యులు ఇలా చేశారని అన్నారు. నెయ్యి కల్తీ అంశాన్ని అంగీకరించాల్సి వస్తుందేమోననే సభను వాయిదా వేశారన్నారు. ప్రశ్నోత్తరాలు సజావుగా జరపాలని అడిగితే మీదకి రావడం, వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిపద్దతి కాదన్నారు. హౌస్‌లోకి విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారని, దేవుడి ఫోటోలు తెస్తున్నారని ఇదేం ప్రవర్తన అని ప్రశ్నించారు.
ఆవు నెయ్యి రూ.320కి వస్తుందా: వీర్రాజు
‘స్వచ్చమైన ఆవు నెయ్యి కిలో రూ.320కి వస్తుందా?.. వీళ్లు(వైసీపీ) 420లు గనుక ఆ ధరకు కొన్నారు’ అని సోము వీర్రాజు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడారా.. లేదా.. అనే విషయమై అప్పటి సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. తిరుమలలో లడ్డూ తయారీకి నెయ్యి కొనుగోలు చేసిన ధరకే జగన్, ఆయన పార్టీ నేతల ఇళ్లల్లో వాడకానికీ కొంటున్నారా? అని ప్రశ్నించారు. ఈ విషయాలు మాట్లాడితే వైసీపీ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.
వైసీపీ తీరుపై పంచుమర్తి ఆగ్రహం
వైసీపీ ఎమ్మెల్సీల తీరుపై చీఫ్‌విప్ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. ప్రశ్నోత్తరాలు జరపాలని చైర్మన్‌ను అడిగితే వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సహా మరికొందరు సోము వీర్రాజు మీదకు వస్తుంటే మంత్రులు వెళ్లి అడ్డుకున్నారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నందిపల్లిలోని ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవాల్లో పాల్గొన్న జగన్.. అక్కడ పూజారి ఇచ్చిన తీర్థాన్ని స్వీకరించకుండా కిందకి వదిలేశారన్నారు. గోత్రనామాలు చెప్పకుండా అవహేళన చేశారని విమర్శించారు.
జగన్‌కు బుద్ధి చెప్పేందుకు హిందువులు సిద్ధం: బీజేపీ నేత వల్లూరు
‘అధికార మదంతో హిందూ ఆలయాలపై దాడిచేసి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అధికారం కోల్పోయాక హిందువుల తరపున మాట్లాడే బీజేపీ ప్రజాప్రతినిధులపై దాడికి యత్నిస్తున్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో చట్ట సభల్లో వారికి జీరో కట్టబెట్టేందుకు హిందువులు సిద్ధంగా ఉన్నారు’ అని రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్ హెచ్చరించారు. మండలిలో సోము వీర్రాజుపై వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు.