Share News

నేనూ వైసీపీనే... అయినా ముస్తఫాకే జగన్‌ సపోర్టు

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:45 AM

‘నేను దళితుడిని. వైసీపీ సభ్యుడిని. నాకు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నుంచి ప్రాణహాని ఉంది. జగన్‌ నాకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకోకుండా ముస్తఫాకే మద్దతు పలకడం బాధాకరం’..

నేనూ వైసీపీనే... అయినా ముస్తఫాకే జగన్‌ సపోర్టు

  • మాజీ ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని.. పొగాకు వ్యాపారి సూరిబాబు

కొయ్యలగూడెం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ‘నేను దళితుడిని. వైసీపీ సభ్యుడిని. నాకు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నుంచి ప్రాణహాని ఉంది. జగన్‌ నాకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకోకుండా ముస్తఫాకే మద్దతు పలకడం బాధాకరం’ అని పొగాకు వ్యాపారి కడిమి సూరిబాబు అన్నారు. కొయ్యలగూడెంకు చెందిన సూరిబాబు బుధవారం స్థానిక జగజ్జీవన్‌రామ్‌, అంబేద్కర్‌ విగ్రహాల వద్ద మీడియాతో మాట్లాడారు. ‘నేను పొగాకు వ్యాపారం చేస్తుంటాను. ముస్తఫా, అతని కుమారుడు బషీర్‌తో ధరల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మంచి ధర ఇవ్వకపోతే మరొకరికి పొగాకు విక్రయిస్తానని చెప్పడంతో ముస్తఫా ఆగ్రహించాడు. గత నెలలో నా కుమారుడు అభి గుంటూరుకు పొగాకు తీసుకెళ్లిన సమయంలో ముస్తఫా అనుచరులు కార్లలో వచ్చి నా కుమారుడితో పాటు వ్యాన్‌ డ్రైవర్‌, గుమస్తాను కిడ్నాప్‌ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నా కుమారుడిని అప్పగించారు. ముస్తఫాపై అన్యాయంగా కేసు కట్టారని ఇటీవల జగన్‌ కర్నూల్‌ జిల్లాలో చెప్పడం బాధాకరం. నేను వైసీపీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ జగన్‌ ఆయనకే సపోర్ట్‌ చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణ మాదిగకు తెలియజేశా. నా కుటుంబానికి ముస్తఫా, అతని కుమారుడి నుంచి రక్షణ కల్పించాలి’ అని సూరిబాబు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Updated Date - Aug 20 , 2026 | 04:46 AM