పదవులు పోయినా.. ‘స్టిక్కర్’ పోలా!
ABN , Publish Date - Feb 25 , 2026 | 04:40 AM
వైసీపీ నాయకులు ఇంకా అధికార దర్పాన్ని వీడలేదు! ఓడిపోయినా ‘ఎమ్మెల్యే’లం.. ‘ఎంపీ’లం అంటూ కార్లకు బోర్డులు తగిలించుకుని మరీ హల్‌చల్ చేస్తున్నారు!
ఓడిపోయినా అధికార దర్పం వీడని వైసీపీ నేతలు
వాహనాలపై ‘ఎమ్మెల్యే’, ‘ఎంపీ’.. స్టిక్కర్లతో హల్‌చల్
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
వైసీపీ నాయకులు ఇంకా అధికార దర్పాన్ని వీడలేదు! ఓడిపోయినా ‘ఎమ్మెల్యే’లం.. ‘ఎంపీ’లం అంటూ కార్లకు బోర్డులు తగిలించుకుని మరీ హల్‌చల్ చేస్తున్నారు! తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆస్పత్రిలో కల్తీపాల బాధితులను పరామర్శించడానికి మంగళవారం వచ్చిన వైసీపీ నాయకుల వాహనాలపై ఎంపీ, ఎమ్మెల్యే స్టికర్లు దర్శనమివ్వడం విమర్శలకు దారితీసింది. వాస్తవానికి వైసీపీని జనం గద్దె దింపి రెండేళ్లు కావస్తోంది. అయినా వారు తమ వాహనాలపై అధికారిక స్టిక్కర్లు తొలగించలేదు. ఏపీ 39 ఆర్‌పీ 3591 కారుకు.. సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే, పలాస అని, మార్గాని భరత్‌రామ్‌కు చెందిన ఏపీ 40ఎఫ్‌జీ 0001 కారుకు పార్లమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్‌ఎస్/ 222, ఎంపీ అని.. ఏపీ 40హెచ్‌ఏ 1122 కారుకు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే, రామచంద్రాపురం అని విండ్‌షీల్డ్‌పై అధికారికారంలో ఉన్నప్పుడు జారీ చేసిన స్టిక్కర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కారుపై ఎమ్మెల్యే స్టిక్కరు, రాజానగరం నియోజకవర్గం అని ఉంది. ఇంకా, మాజీ మంత్రులు తానేటి వనిత, విడదల రజిని కార్లతోపాటు, స్థానికంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా వారి వాహనాలపై ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లు అతికించుకొని.. సైరన్లతో హల్‌చల్ చేస్తున్నా.. అడ్డు కొనేవారు లేకపోవడం గమనార్హం!