‘ఏబీఎన్’ ఆఫీసు ముందు వైసీపీ రచ్చ..19 మందిపై కేసు
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:17 AM
నిరసన పేరుతో హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు వీరంగం తొక్కిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్/అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): నిరసన పేరుతో హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు వీరంగం తొక్కిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ‘ఏబీఎన్’ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ పర్వతనేని వెంకటకృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం ఫిల్మ్ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతిలేకుండా ధర్నాకు దిగడంతోపాటు... ‘‘మీ అంతు చూస్తాం. మీ ఆఫీసును పగలగొడతాం. మేం తలచుకుంటే ఆఫీసు నుంచి ఒక్కరు కూడా బయటికి పోలేరు’ అంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతోపాటు సిబ్బందికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా నినాదాలు చేశారని తెలిపారు. ఏబీఎన్ ఉద్యోగులను దుర్భాషలాడుతూ భయపెట్టేలా ప్రవర్తించారని బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2) రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. నిందితుల్లో... అంబటి రాంబాబు, జోగి రమేశ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మార్గాని భరత్, నాగార్జున, ఆదిమూలపు సురేశ్, విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, గురుమూర్తి, లక్ష్మీ పార్వతి, శ్రీకాంత్ రెడ్డి సహా మొత్తం 19 మందిపై కేసు నమోదైంది. నిందితులకు నోటీసులు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.