Share News

పేదల ఇళ్ల పేరిట.. వైసీపీ నేత తోపుదుర్తి మోసం!

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:28 AM

పేదలను నిలువునా ముంచిన ‘రాక్రీట్‌’ సంస్థకు ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ శివారులోని నున్న పోలీసుస్టేషన్‌లో సంస్థపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి..

పేదల ఇళ్ల పేరిట..  వైసీపీ నేత తోపుదుర్తి మోసం!

  • అధికారం అండతో నాడు 3 వేల ఇళ్ల కాంట్రాక్టు పొందిన ‘రాక్రీట్‌’

  • ఒప్పందం ప్రకారం 3 దశల్లో పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణం

  • మధ్యలోనే వదిలేసిన సంస్థ

  • మెటీరియల్‌ తీసుకుని కూడా నిలిపివేసిన నిర్మాణ పనులు

  • బెజవాడ పోలీసు స్టేషన్‌లో కేసు

  • వైసీపీ హయాంలోనే మోసం

  • అప్పట్లో మేనేజ్‌ చేసిన ‘పెద్దలు’

జగనన్న ఇళ్ల కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ నేత, రాప్తాడు అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేదలను నిలువునా ముంచేశారు. విజయవాడ శివారులోని నున్నలో 3 వేల మంది పేదలకు ఇళ్లను నిర్మించేలా ఒప్పందం చేసుకుని అర్ధాంతరంగా చేతులెత్తేశారు. ప్రభుత్వం నుంచి మెటీరియల్‌ తీసుకుని పక్కదారి పట్టించారు. దీంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. ఫలితంగా అటు పేదలు, ఇటు ప్రభుత్వం కూడా నష్టపోయాయి. ఎట్టకేలకు ఈ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

పేదలను నిలువునా ముంచిన ‘రాక్రీట్‌’ సంస్థకు ఉచ్చు బిగుస్తోంది. విజయవాడ శివారులోని నున్న పోలీసుస్టేషన్‌లో సంస్థపై కేసు నమోదైంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అప్పటి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి చెందిన రాక్రీట్‌ సంస్థ వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గూడులేని పేదలతో చెలగాటమాడింది. విజయవాడ శివారులో నున్న జగనన్న మోడల్‌ కాలనీ, పళ్లతిప్పలో మరో జగనన్న కాలనీ పేరుతో 3 వేల పేదల ఇళ్ల నిర్మాణ పనులను ఈ సంస్థ దక్కించుకుంది.


అయితే, ఆయా పనులను అర్ధాంతరంగా నిలిపివేయడంతో పేదలు అన్ని విధాలా నష్టపోయారు. అదేసమయం లో దశల వారీగా ప్రభుత్వం ద్వారా పొందిన మెటీరియల్‌కు తగినట్టు పనులు చేయకపోవటంతో ఖజానాకు రూ.4 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. రాక్రీట్‌ దక్కించుకున్న వాటిలో ‘నున్న’ లేఅవుట్‌లో 1500 ఇళ్లు, వికాస్‌ కాలేజీ వెనుక పళ్లతిప్పలో మరో 1500 ఇళ్లు ఉన్నాయి. అయితే, రాక్రీట్‌ మోసాలపై అంతర్గత విచారణ జరిపిన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ విజయవాడ పోలీసు కమిషనర్‌కు రెండు నెలల కిందటే ఫిర్యాదు చేశారు. దీంతో న్యాయపరమైన సలహాను తీసుకున్న కమిషనర్‌.. తాజాగా కేసు నమోదు చేశారు. అదేవిధంగా నున్న పోలీసుస్టేషన్‌లో గురువారం హౌసింగ్‌ అధికారులు మరోసారి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.


రాక్రీట్‌తో ఒప్పందం ఇదీ

నున్న మోడల్‌, పళ్లతిప్ప లేఅవుట్‌లలో రాక్రీట్‌ సంస్థ 3 వేల ఇళ్ల నిర్మాణానికి రాక్రీట్‌ సంస్థ కాంట్రాక్టు పొందింది. దీనికి సంబంధించి ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి(యూనిట్‌) రూ.1.80 లక్షలు ఖర్చవుతుందని అధికారులు నిర్ణయించారు. అయితే.. రాక్రీట్‌ సంస్థ ఈ మొత్తానికి పనులు చేపట్టలేమని చెప్పడంతో.. ఒక్కొక్క ఇంటికి రూ.35 వేల చొప్పున అదనంగా ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ నిధులను స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి వాటిని గృహ నిర్మాణ సంస్థ అధికారులు తమ ఖాతాల్లో ఉంచారు. రాక్రీట్‌ సంస్థ దక్కించుకున్న 3 వేల ఇళ్ల నిర్మాణ పనులకు హౌసింగ్‌ అధికారులు దశల వారీగా మెటీరియల్‌ ఇచ్చేలా, అంతిమంగా డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. తొలుత పునాదులు, తర్వాత గోడలు, పైకప్పు నిర్మించాల్సి ఉంది.

మోసం ఎలా జరిగింది?

ఇళ్ల నిర్మాణం బేస్‌మెంట్‌, రూఫ్‌ లెవల్‌, శ్లాబ్‌ వంటి మూడు దశల్లో చేపట్టాలి. బేస్‌మెంట్‌ దశలోనే మోసం ఎక్కువగా జరిగింది. బేస్‌మెంట్‌ వేసిన తర్వాత గ్రావెల్‌ను ఫిల్‌ చేసి.. పైన పీసీసీ ఫ్లోరింగ్‌ వేయాలి. ఈ పనులను రాక్రీట్‌ సంస్థ గాలికి వదిలేసింది. ప్రభుత్వం ఇచ్చిన సిమెంట్‌, స్టీల్‌ తదితర మెటీరియల్‌ను పక్కదారి పట్టించింది.


రాక్రీట్‌ కోసమే రూ.70 వేలు

రాక్రీట్‌ సంస్థ ప్రయోజనాల కోసమే అప్పట్లో బేస్‌మెంట్‌ ధరను పెంచారన్న ఆరోపణలు వచ్చాయి. రాక్రీ ట్‌ సంస్థకు ఇళ్ల నిర్మాణాలను అప్పగించేటప్పుడు బేస్‌మెంట్‌ ధరను రూ.70 వేలుగా నిర్ణయించారు. అంతకు ముందు ఇది రూ.50 వేలు, తర్వాత రూ.60 వేలుగా ఉండేది. కాగా, తమ ఇళ్ల నిర్మాణాలను అర్ధంతరంగా వదిలేసిన రాక్రీట్‌ సంస్థపై లబ్ధిదారులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలువురు ఆనాడే ఫిర్యాదులు చేశారు. విజయవాడలోని రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడుకు చెంది న పలువురు లబ్ధిదారులు పటమట పోలీసు స్టేషన్‌లో భారీ సంఖ్యలో ఫిర్యాదు చేశారు. కానీ, అప్పట్లో వైసీపీ పెద్దల జోక్యంతో పోలీసులు కేసులు కట్టలేదు. తాజాగా రాక్రీట్‌ సంస్థ చేసిన మోసంపై హౌసింగ్‌ అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో కలెక్టర్‌ కు, తర్వాత పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు నున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

రూ.4 కోట్ల మేర నష్టం

రాక్రీటు సంస్థ కాంట్రాక్టు తీసుకున్న ఇళ్లలో 300 గృహాలకు పునాదులు వేశారు. 150 ఇళ్లకు బేస్‌మెంట్‌ పీసీసీ, 70 ఇళ్లను పైకప్పు వరకు, 200 ఇళ్లను శ్లాబ్‌ లెవల్‌కు నిర్మించి అర్ధంతరంగా పనులు నిలిపివేశారు. అనంతరం.. ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు హౌ సింగ్‌ అధికారులకు అందుబాటులో లేకుండా పోయా రు. ఫోన్లు చేసినా.. ఎవరూ స్పందించలేదు. రాక్రీట్‌ సంస్థ చేసిన నిర్వాకం పేదలకు శాపంగా మారింది. 3 వేల ఇళ్లలో కనీసం 300 ఇళ్లు కూడా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ వ్యవహారంపై విజలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేశారు. వారి విచారణలో రూ.4 కోట్ల మేరకు రాక్రీట్‌ సంస్థ నష్టం చేసినట్టు గుర్తించారు. దశల వారీగా ఇచ్చిన మెటీరియల్‌ను వినియోగించకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందని తెలిసింది.

Updated Date - Apr 04 , 2026 | 03:30 AM