యువకుడి మృతి కేసులో వైసీపీ నేత ‘తోపుదుర్తి’ అరెస్టు
ABN , Publish Date - May 27 , 2026 | 04:42 AM
అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే సోదరుడిని అదుపులోకి తీసుకున్న అనంత పోలీసులు
గతేడాది రైలు పట్టాలపై అనునామాస్పదంగా ఓ యువకుడి మృతి
తన కొడుకును తోపుదుర్తి సోదరులే చంపారని తండ్రి ఫిర్యాదు.. స్పందించిన ఎస్పీ
అనంతపురం క్రైం, మే 26(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు, వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు జయపాల్‌రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశ్‌రెడ్డి స్వగ్రామానికే చెందిన ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన ఉమామహేశ్వర్‌రెడ్డి అనే యువకుడిని వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వీరిపై కేసు నమోదు చేశారు. ఉమామహేశ్వర్‌రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అభిమాని. వీరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడి మృతి కేసులో అనంతపురం శ్రీనగర్ కాలనీలోని ఇంటి వద్ద ఉన్న తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం భారీ బందోబస్తు నడుమ అరెస్టు చేశారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం జ్యుడీషియల్ ఫస్ల్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా.. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వివరాల్లోకి వెళ్తే.. తోపుదుర్తి గ్రామానికి చెందిన మల్లిరెడ్డి కుమారుడు ఉమామహేశ్వర్‌రెడ్డి గతేడాది జనవరి 26న తాటిచెర్ల సమీపంలోని రైల్వేట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీనిపై అనంతపురం రైల్వే పోలీసులు క్రైం నంబర్ 05/2025, బీఎన్‌ఎ్‌స 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు కోసం కేసును అనంతపురం రూరల్ పోలీసులకు బదిలీ చేశారు. అయితే కేసు దర్యాప్తులో కదలిక లేకపోవడంతో మృతుడి తండ్రి మల్లిరెడ్డి, ఈ నెల 11న పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ జగదీశ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తన కుమారుడిని తోపుదుర్తి సోదరులే చంపేశారని, న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో అనంతపురం రూరల్ పోలీసులు కేసులో అదనపు ఆధారాలు సేకరించారు. తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, జయపాల్‌రెడ్డిపై బీఎన్‌ఎ్‌స 108, 111 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు మంగళవారం తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి, ఆయన్ను అరెస్టు చేశారు.
పోలీసులకు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బెదిరింపులు
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమామహేశ్వర్‌రెడ్డిని పరిటాల శ్రీరామ్ హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ‘జగన్ మళ్లీ సీఎం అవుతారు. మా ప్రభుత్వం వచ్చాక సుమోటోగా కేసు విచారణ చేస్తాం. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకుంటాం’ అని బెదిరించేలా మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
కోర్టు వద్ద వైసీపీ మూకల హల్‌చల్
రాజశేఖర్‌రెడ్డి అరెస్టుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆందోళనకు దిగి పోలీ్‌సస్టేషన్‌లోకి, కోర్టులోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారు. రాజశేఖర్‌రెడ్డిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, అనంతపురం రూరల్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోర్టుకు తరలిస్తున్న క్రమంలో, తమనూ అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కూడా కోర్టులోకి వెళ్లాలని గేటు వద్దకు రాగా, పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన కోర్టు బయట రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వైసీపీ మూకల చర్యలతో కోర్టు, అనంతపురం రూరల్, టూటౌన్ స్టేషన్ల వద్ద ఉద్రిక్తత కొనసాగింది. ఆ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.