Share News

వైసీపీ నేత చింతాడ అరెస్ట్‌

ABN , Publish Date - Aug 09 , 2026 | 04:56 AM

మహిళా ఎస్‌ఐపై అరాచకానికి పాల్పడిన కేసులో తొమ్మిది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఏ1 నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను..

వైసీపీ నేత చింతాడ అరెస్ట్‌

  • మహిళా ఎస్‌ఐపై అరాచకం ఘటనలో అదుపులోకి తీసుకున్న సిక్కోలు పోలీసులు

  • మేం జగన్‌ శిష్యులం దేనికైనా తెగిస్తాం.. అరెస్టు సమయంలో రవి

శ్రీకాకుళం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మహిళా ఎస్‌ఐపై అరాచకానికి పాల్పడిన కేసులో తొమ్మిది రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న ఏ1 నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జి చింతాడ రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ అనుకూల మీడియాతో మాట్లాడేందుకు శనివారం రాత్రి తాను ఉన్న ప్రాంతానికి రిపోర్టర్లను రవి పిలిపించుకున్నారు. అప్పటికే పక్కా సమాచారంతో ఆ రిపోర్టర్ల కంటే ముందే వెళ్లి నిఘా పెట్టారు. అనుకూల రిపోర్టర్లతో చింతాడ మాట్లాడుతున్న సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి అరెస్టు చేశారు. కాగా, ఇదే కేసులో 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా శనివారం ఉదయం 9 మంది కోర్టులో లొంగిపోయారు. వీరికి స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

జగన్‌ పర్యటనలో అరాచకం

వైసీపీ అధినేత జగన్‌ శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో చింతాడ సహా వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై చిందులు తొక్కారు. బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జ పోలీసు స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ ప్రవల్లికను నడిరోడ్డుపై అడ్డుకుని దుర్భాషలాడుతూ.. అరాచకానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ ప్రవల్లిక ఫిర్యాదు మేరకు చింతాడ సహా 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే.. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న రవికుమార్‌.. తాను చిలకపాలెం వద్ద ఉన్నానని, అక్కడకు రావాలని అనుకూల ఎలకా్ట్రనిక్‌ మీడియా(3 చానెళ్లు)కు కబురు పెట్టారు.


అయితే, సదరు మీడియా రిపోర్టర్ల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు.. శనివారం వారి కంటే ముందుగా చిలకపాలెం వద్ద మాటువేశారు. ఆ మీడియా చానెళ్ల రిపోర్టర్లతో చింతాడ మాట్లాడుతుండగా.. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇదిలావుంటే, చింతాడ, అతని అనుచరులు కోర్టులో లొంగిపోతున్నారంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేశారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో శ్రీకాకుళం డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి రవికుమార్‌ లొంగిపోతారని చెప్పారు. విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఇతర నాయకులు.. శ్రీకాకుళంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే, వీళ్లకు తెలియకుండానే పోలీసులు చిలకపాలెంలో రవికుమార్‌ను అరెస్ట్‌ చేశారు.


భయపడేది లేదు: చింతాడ

అరెస్టు సమయంలో అనుకూల మీడియాతో చింతాడ మాట్లాడుతూ.. ‘‘మేము జగన్‌ శిష్యులం. ఆయన కోసం దేనికైనా తెగిస్తాం. కేసులకు భయపడేది లేదు. లోకేశ్‌ డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోంది.’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Aug 09 , 2026 | 04:57 AM