‘రైస్ పుల్లింగ్’ పేరుతో 13 లక్షల దోపిడీ
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:34 AM
‘రైస్ పుల్లింగ్’ పేరుతో మోసగించిన కేసులో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండల వైసీపీ కన్వీనర్ చింతకుంట క్రిష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
మహిమ గల రాగి చెంబు అంటూ మోసం
శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీ నేత అరెస్టు
నిందితుడు తలుపుల మండల పార్టీ కన్వీనర్
కదిరి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘రైస్ పుల్లింగ్’ పేరుతో మోసగించిన కేసులో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండల వైసీపీ కన్వీనర్ చింతకుంట క్రిష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చింతకుంట క్రిష్ణారెడ్డి అలియాస్ డీకే బాబు అలియాస్ డిక్కీబాబు ప్రస్తుతం తలుపుల మండల వైసీపీ కన్వీనర్‌గా, తలుపుల ఉపసర్పంచ్‌గా పనిచేస్తున్నాడు. డీఎస్పీ శివనారాయణస్వామి ఆదివారం కదిరి రూరల్ సర్కిల్ పోలీసుస్టేషన్‌లో కేసు వివరాలు వెల్లడించారు. క్రిష్ణారెడ్డి రైస్ పులింగ్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.13 లక్షలు తీసుకున్నాడని, మరో రూ.7 లక్షలకు ప్రామిసరీ నోటు రాయించుకున్నాడని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి, అతని నుంచి ఫార్చూనర్ వాహనం, మూడు సెల్‌ఫోన్లు, ఐదు రాగి చెంబులు, రూ.1.08 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డిక్కీబాబు రైస్ పుల్లింగ్ మహిమ గల రాగి చెంబు తయారు చేసే విద్య తనకు తెలుసని, దానిని మార్కెట్‌లో రూ.2 కోట్లకు అమ్మొచ్చని నమ్మించాడు. వాటిని నమ్మిన తలుపుల మండలం బురుజుపల్లికి చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే రైతు గతేడాది రూ.10 లక్షలు ఇచ్చాడు. ఈ ఏడాది జనవరిలో మరో రూ.10 లక్షలు ఇస్తే, రాగి చెంబును తయారు చేసి, అమ్మి ఇస్తానని డిక్కీబాబు వేణుగోపాల్ రెడ్డికి చెప్పాడు. నమ్మకం కుదరని బాధితుడు.. తనకు చెంబు వద్దనీ, రూ.10 లక్షలు తిరిగివ్వాలని అడిగాడు. దీంతో డబ్బులు ఇచ్చేది లేదని, రాగి చెంబు ఇస్తానని డిక్కీబాబు చెప్పాడు. బాధితుడు జనవరి చివర్లో తలుపులలోని డిక్కీబాబు ఇంటికెళ్లాడు. నిందితుడు ఓ రాగిచెంబును బాధితుడికి ఇచ్చి, తర్వాత అమ్మి డబ్బులిస్తానని చెప్పాడు.
పలుమార్లు వేణుగోపాల్ రెడ్డి.. రాగి చెంబు అమ్మి డబ్బులివ్వాలని అడిగినా పట్టించుకోలేదు. ఈ నెల 15న బాధితుడు.. డీకే బాబు ఇంటికెళ్లి రాగి చెంబు వెనక్కి ఇచ్చి, రూ.10 లక్షలు తిరిగివ్వాలని అడిగాడు. నిందితుడు ఆ రాగి చెంబు తీసుకుని, మరో రూ.10 లక్షలు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించడంతో పాటు బంధించాడు. దీంతో వేణుగోపాల్ రెడ్డి.. స్నేహితులకు విషయం చెప్పాడు. వారు డిక్కీ బాబుకు రూ.3 లక్షల నగదు ఇచ్చి, రూ.7 లక్షలకు ప్రామిసరీ నోట్లు రాసిచ్చారు. రూ.7 లక్షలు ఇవ్వకపోతే చంపుతామని నిందితుడు బెదిరించాడు. వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు తలుపుల పోలీసులు కేసు నమోదు చేశారు. డిక్కీ బాబును తనకల్లు మండలంలోని రాకుంటపల్లి సమీపాన వైజంక్షన్ వద్ద అరెస్టు చేశారు. డిక్కీబాబుపై తలుపుల స్టేషన్‌లో ఇది వరకే 7 కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. కాగా, రైస్ పులింగ్ పేరుతో పలువురిని మోసగించిన వైసీపీ నేత డిక్కీ బాబు.. ఆ సొమ్ములో పలువురు నాయకులకు వాటాలు పంపినట్లు సమాచారం. ఓ పార్టీకి చెం దిన జిల్లా అధ్యక్షురాలికి 18 తులాల బంగారం కొనిచ్చినట్లు తెలుస్తోం ది. ఓ పార్టీ ఇన్‌చార్జికి రూ.2 కోట్లకు రాగి చెంబు అమ్మిస్తానని నమ్మిం చి, రూ.40 లక్షలు తీసుకుని, మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.