ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - Mar 31 , 2026 | 06:14 AM
వైసీపీ నేత ఆళ్ల రామృకృష్ణారెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని...
సీఎంపై వైసీపీ నేత వేసిన పిటిషన్లు కొట్టివేత
అమరావతి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత ఆళ్ల రామృకృష్ణారెడ్డికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని నమోదైన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని, విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి కేసును ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. ఆ పిటిషన్లకు విచారణార్హత లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం స్పష్టం చేశారు. ఈ మూడు పిటిషన్లు ఇటీవల విచారణకు రాగా... ఆళ్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చంద్రబాబు ప్రస్తుతం సీఎంగా ఉన్నారని, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఐడీ పనిచేస్తోందని, అందువల్ల సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు. దర్యాప్తును ప్రభావితం చేసి బెయిల్ షరతులను ఉల్లంఘించినందున చంద్రబాబు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తారని, ఈ కేసులో అలాంటి పరిస్థితులు ఏమీ లేవని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, వాటిని కొట్టివేయాలని కోరారు.