20 ఏళ్ల క్రితమే రూపాయికి
ABN , Publish Date - May 01 , 2026 | 04:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ బడా కంపెనీలకు చౌకగా భూములను కేటాయిస్తోంది. ఫార్చ్యూన్-100 జాబితాలో ఉండే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామని ప్రకటించింది.
బ్రాండిక్స్‌కు కేటాయించిన వైఎస్
విశాఖలో వెయ్యి ఎకరాలు 20 ఏళ్ల లీజుకు..
ఉపాధి తెస్తుందని ఉదారంగా భూవితరణ
ఇప్పుడు అక్కడ 26 వేల మందికి ఉపాధి
నాడు వ్యతిరేకించని విపక్షాలు
నేడు ఐటీ దిగ్గజాలతో లక్షల మందికి ఉపాధి
అయినా ఆ కంపెనీలకు 99 పైసలకు భూములిస్తే వైసీపీ గగ్గోలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కార్పొరేట్ బడా కంపెనీలకు చౌకగా భూములను కేటాయిస్తోంది. ఫార్చ్యూన్-100 జాబితాలో ఉండే కంపెనీలకు 99 పైసలకే భూములు ఇస్తామని ప్రకటించింది. ఇన్ఫోసి్‌సకు ఇటీవలే ఆ రేటుకు 20 ఎకరాలు కేటాయించింది. దీనిని తప్పుబడుతూ, ప్రభుత్వం విలువైన భూములను దోచిపెడుతోందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. ‘99 పైసలకు భూములిస్తారా? ఈ విడ్డూరం ఎక్కడైనా ఉందా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే, కాస్త వెనక్కి వెళ్లి చూస్తే, ఆ పార్టీ అధినేత జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 20 ఏళ్ల క్రితమే ఎకరం రూపాయి చొప్పున బ్రాండిక్స్ అనే శ్రీలంక కంపెనీకి వెయ్యి ఎకరాలు ఇచ్చారు. లోదుస్తులు తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేస్తామని, 60 వేల మందికి ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఈ సంస్థ ముందుకు వచ్చింది. ప్రజల జీవన విధానం మెరుగుపడుతుందని భావించి, 2005లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం మండలంలో భూములను 20 ఏళ్లకు లీజు ఇచ్చారు. దీని కోసం ఏపీఐఐసీ 2007లో ప్రత్యేకంగా ఆర్థిక మండలి (ఏపీఎ్‌సఈజెడ్) ఏర్పాటుచేసింది. సుమారు రూ.230 కోట్లతో విద్యుత్, నీరు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. అక్కడితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ తరపున లక్ష మంది మహిళలకు ఆధునిక మిషన్లపై ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చింది. నాడు ప్రతిపక్షాలు ఎవరూ ఆ నిర్ణయాన్ని తప్పుబట్టలేదు. స్వాగతించాయి. ఉపాధి అవకాశాలు వస్తాయని సంతోషించాయి. 2010లో బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీకి పూర్తిస్థాయి ఇండస్ట్రియల్ పార్క్ హోదా ఇచ్చారు. ఇది జరిగి 20 ఏళ్లు అయింది. అక్కడ ఇప్పుడు 15కి పైగా కంపెనీల్లో 26 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారి కోసం 200 బస్సులు నడుస్తున్నాయి. ఇదంతా ప్రగతిగానే భావించారు. ఎవరూ విమర్శలు గుప్పించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తదితర సంస్థలకు ఎకరా 99 పైసలు చొప్పున భూములు కేటాయించింది. ఇవన్నీ కలిపినా వేయి ఎకరాలు లేవు. ఈ సంస్థలు వస్తే విశాఖలో ఐటీ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. వందలాది అనుబంధ కంపెనీలు వస్తాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయి. వలసలు తగ్గుతాయి. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం తక్కువ రేటుకు భూములు ఇచ్చింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర సంస్థలు ఆషామాషీ కావు. వారి పెట్టుబడులూ తక్కువ కాదు. ఇది తెలిసినా, రాజకీయం కోసం నానా యాగీ చేస్తూ, ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని వైసీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తున్నారు.