Share News

మనం చెబితే నమ్మేస్తారా!?

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:27 AM

‘వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా?’... వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలివి! కాపులను పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని, వారి ఓట్లను..

మనం చెబితే నమ్మేస్తారా!?

  • జగన్‌ స్కెచ్‌పై కాపు నేతల్లోనే సందేహం

  • అధికారంలో ఉండగా కాపులపై విద్వేషం

  • రిజర్వేషన్లు, నిధుల్లో ఆ వర్గానికి అన్యాయం

  • కాపుల ఓట్లే అక్కర్లేదన్నట్లుగా జగన్‌ వైఖరి

  • ఆ విషయాలపై చర్చ జరిగితే అసలుకే మోసం

  • ‘ఆత్మీయ భేటీ’లో పాల్గొన్న నేతల్లో ఆందోళన

  • కీలక అంశాలు చర్చకు రాకుండా సీనియర్ల కట్టడి

  • కాపులకు మళ్లీ దగ్గరకావడంపైనే చర్చించాలని స్పష్టీకరణ

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

‘వైసీపీని కాపులు నమ్ముతారా? వారికి అండగా ఉంటామని చెబితే విశ్వసిస్తారా?’... వైసీపీలోని కాపు నేతల్లోనే తలెత్తుతున్న ప్రశ్నలివి! కాపులను పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని, వారి ఓట్లను చీల్చాలనే ప్రణాళికలో భాగంగా ఆదివారం ఏర్పాటు చేసిన తొలి సమావేశంలో ఇలాంటి అనేక సందేహాలు తలెత్తాయి. తాము ఈ అజెండాతో వెళితే... నాడు కాపులకు జగన్‌ చేసిన అన్యాయాలన్నీ చర్చకు వస్తాయని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని పలువురు కాపునేతల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే... నాడు కాపు రిజర్వేషన్లను జగన్‌ రద్దు చేశారు. పవన్‌ కల్యాణ్‌పై అదేపనిగా విరుచుకుపడ్డారు. కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే... ‘మీ ఓట్లు మాకు అక్కర్లేదు’ అనేలా వ్యవహరించారు. ఇప్పుడేమో కాపుల ఓట్లు చీల్చండి అంటూ వైసీపీలోని ఆ సామాజిక వర్గ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా... ఆ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఆదివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని వెంకటాయపాలెంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, కురసాల కన్నబాబుతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జి స్థాయిలో ఉన్న సుమారు పాతికమంది నేతలు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... కాపు సామాజిక వర్గాన్ని వైసీపీకి మళ్లీ చేరువ చేసి, జగన్‌ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలని సీనియర్లు అడిగారు.


కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో కాపులకు అన్యాయం చేసిందని, పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ ఆ వర్గానికి మేలు జరగలేదని తమ సామాజికవర్గంలోకి బలంగా వెళ్లేలా చూడాలని సూచించారు. కూటమివైపు ఉన్న కాపు ఓటు బ్యాంకు దెబ్బతీసేలా చూడాలన్నారు. అయితే... జగన్‌ అధికారంలో ఉండగా కాపులకు అన్యాయం చేసి, ఇప్పుడు మళ్లీ వారికి దగ్గరవడం కుదురుతుందా? అన్నదే అసలు ప్రశ్న! అయితే... ఈ దిశగా చర్చ జరగకుండా సీనియర్లు ముందే కట్టడి చేశారు. కొందరు తమ నియోజకవర్గాల్లో ఇబ్బందులు ప్రస్తావించే ప్రయత్నం చేయగా... ‘అవేవీ మాట్లాడొద్దు. కాపు సామాజికవర్గాన్ని వైసీపీ వైపు తిప్పడం గురించే చర్చిద్దాం’ అని తేల్చి చెప్పారు.


మనం చేసిందేమిటి!?

జగన్‌ అజెండాతో అసలుకే మోసం వస్తుందని ఈ భేటీ ముగిసిన అనంతరం పలువురు కాపు నేతలు వాపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్‌ ఆ వర్గాన్ని వంచించారు. కాపు కార్పొరేషన్‌ రుణాలను నిలిపివేశారు. విదేశీ విద్య రుణాలు, కాపు భవనాల నిర్మాణంలోనూ అన్యాయమే! దీనివల్లే వైసీపీకి తమ వర్గం దూరమైందని, ఇప్పుడు కూటమి కాపులకు అన్యాయం చేస్తోందన్నా నమ్మే పరిస్థితి లేదని తెలిపారు.

తీర్మానాలపై స్పందనే లేదు..

వైసీపీ కాపు సామాజికవర్గ నేతల తొలి ఆత్మీయ సమావేశంలో పలు తీర్మానాలను ప్రతిపాదించారు. ‘‘కాపు సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కాపు కార్పొరేషన్‌ బకాయి నిధులు విడుదల చేయాలి. సామాజికవర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా అంతా స్పందించాలి. కాపులపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలి’ అంటూ మాజీ మంత్రి కన్నబాబు పలు తీర్మానాలు ప్రవేశపెట్టారు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారనే మాట తప్పితే... నేతల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. నియోజకవర్గాల నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలకు పెద్దగా ప్రాధాన్యంఇవ్వకపోవడంతో వారంతా ముభావంగా కనిపించారు.

Updated Date - Jun 22 , 2026 | 05:28 AM