Share News

నేడు వైసీపీ కాపు నేతల భేటీ

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:41 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు, మొత్తంగా కూటమికి వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టాలన్నదే వైసీపీ వ్యూహం! కాపు ఓట్లను చీల్చి రాజకీయంగా..

నేడు వైసీపీ కాపు నేతల భేటీ

  • తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు

  • వైసీపీ తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యం: తోట

ద్రాక్షారామ/అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు, మొత్తంగా కూటమికి వ్యతిరేకంగా కాపులను రెచ్చగొట్టాలన్నదే వైసీపీ వ్యూహం! కాపు ఓట్లను చీల్చి రాజకీయంగా లబ్ధిపొందడంపై వైసీపీ దృష్టి సారించిందని, దీనిపై జగన్‌ నిర్దిష్ట సూచనలు చేశారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో వైసీపీ కాపు నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘ఈ సమావేశానికి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా ఉన్న కాపు నాయకులను ఆహ్వానించాం. బొత్స సత్యనారాయణ తదితరులు కూడా హాజరవుతారు. వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాం. వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో సమీక్షిస్తాం. వైసీపీ కాపు నేతల సమావేశం నా ఆలోచన మాత్రమే. అధిష్ఠానానికి సంబంధం లేదు’’ అని శనివారం తోట త్రిమూర్తులు మీడియాకు తెలిపారు. భవిష్యత్‌లో కూడా వైసీపీ కాపు నేతల భేటీలు జరుగుతాయన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 06:43 AM