Share News

అలా వచ్చారు.. ఇలా వెళ్లారు!

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:47 AM

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మొండికేస్తున్న మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ ఎట్టకేలకు సభకు హాజరయ్యారు....

అలా వచ్చారు.. ఇలా వెళ్లారు!

  • 9.59 గంటలకు అసెంబ్లీలోకి జగన్‌ అండ్‌ కో

  • గవర్నర్‌ ప్రసంగిస్తుండగా అబద్ధాలు చదువుతున్నారని నినాదాలు

  • 10.10 గంటలకే వాకౌట్‌

అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మొండికేస్తున్న మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ ఎట్టకేలకు సభకు హాజరయ్యారు. అయితే అలా వచ్చి.. ఇలా వెళ్లారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన బుధవారం (ఫిబ్రవరి 11).. ఆయన తనతో పాటు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో, పార్టీ ఎమ్మెల్సీలతో వెలగపూడిలోని అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ శ్రేణులు, సొంత మీడియా ప్రతినిధులు అక్కడ సిద్ధంగా ఉంచిన ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అసెంబ్లీ ప్రాంగణం వరకూ అనుమతించిన సెక్యూరిటీ.. సభలోకి ప్లకార్డులు అనుమతించలేదు. దీంతో వాటిని అక్కడే వదిలేసి సరిగ్గా 9.59 గంటలకు సభలోకి చేరుకున్న జగన్‌, ఆయన పార్టీ సభ్యులు.. 10.10కు అంటే కేవలం 11 నిమిషాల్లోనే బయటకు వెళ్లిపోయారు. ఏడాదిన్నర క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున జగన్‌ సహా 11 మంది మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష హోదా కోసం అవసరమైన 18 స్థానాలు కూడా ఆ పార్టీకి రాకపోవడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. దిక్కుతోచని జగన్‌ సభకు రానంటూ భీష్మించుకున్నారు. పలు వర్గాల నుంచి ఆరోపణలు రావడంతో పాటు సభకు వరుసగా 60 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండడంతో జగన్‌ తన ఎమ్మెల్యేలతో కలిసి వచ్చారు. అసెంబ్లీ బయట ఆయన వాహనం ఆపి.. అప్పటికే అక్కడకు చేరుకున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్లకార్డులు పట్టుకుని ర్యాలీగా ముందుకు సాగారు. ‘ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు’ అనే ప్లకార్డు ఆయన స్వయంగా పట్టుకోగా.. ‘సమస్యలు ప్రస్తావించనీయరు..’, ‘శాంతిభద్రతలు కాపాడాలి..’, ‘మెడికల్‌ కాలేజీల నిర్మాణం పీపీపీ పద్ధతిలో వద్దు..’ అంటూ ఇతర సభ్యులు ప్లకార్డులు చేతబూనారు. నాలుగో నంబర్‌ గేటు వద్ద.. ప్లకార్డులకు అనుమతి లేదని భద్రతాసిబ్బంది చెప్పడంతో వాటిని అక్కడే వదిలేసి లోపలకు వెళ్లారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తుండగా.. అబద్ధాలు చదువుతున్నారంటూ నినాదాలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి పేపర్లు చించి విసిరేశారు. గవర్నర్‌ అవేవీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడంతో.. సరిగ్గా 11 నిమిషాల తర్వాత జగన్‌, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు. జగన్‌ నేరుగా తాడేపల్లి ప్యాలె్‌సకు వెళ్లిపోగా.. ఆ పార్టీ సభ్యులు ప్రాంగణంలోనే ఆగి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, కూటమి నేతలు గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. కాగా.. సభ్యత్వం రద్దవుతుందన్న భయంతోనే జగన్‌ అండ్‌ కో సభకు వచ్చారని కూటమి ఎమ్మెల్యేలు లాబీల్లో చర్చించుకున్నారు.


ప్రతిపక్ష హోదా కోసం జగన్‌ తపన!!

ప్రధాన ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్మోహన్‌రెడ్డి ఎంతగా తపించిపోతున్నారో బుధవారం మరోసారి బహిర్గతమైంది. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలన్న ప్లకార్డును అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన స్వయంగా ప్రదర్శించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శాసనసభలో తగిన సంఖ్యాబలం (18 సీట్లు) లేనిదే ఆ హోదా ఇవ్వరన్న నిజం తెలిసీ ఆయన పదేపదే హడావుడి చేస్తున్నారని రాజకీయ వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసమో, తిరుమల లడ్డూ కల్తీ, ఇతర ప్రజా సమస్యలపై చర్చకు డిమాండ్‌ చేయడం కాకుండా.. తనకు పదవి ఇవ్వాలని ప్లకార్డు పట్టుకోవడమేంటని ఎద్దేవాచేస్తున్నాయి. శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉంది గనుకే సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణకు అక్కడ ప్రతిపక్షనేతహోదా దక్కిందని,పైగా మండలిలోపార్టీ నేతగా జగనే ఆయన్ను నియమించారని గుర్తుచేస్తున్నాయి

నేడు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం..

గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్‌ అధ్యక్షతన వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. ఇందులో కూడా.. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ ఆయన పునరుద్ఘాటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 12 , 2026 | 01:47 AM