Deputy CM Pawan: వైసీపీ నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తోంది
ABN , Publish Date - Jan 10 , 2026 | 04:29 AM
వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిందని, ఇప్పుడు మళ్లీ పాత పద్ధతులు మొదలుపెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
తెలిసింది బూతులు తిట్టడం.. కేసులు పెట్టడమే
ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాలి
సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యవాది
నియంత్రణ పాటిద్దాం అంటుంటారు
గత ఐదేళ్లూ ప్రజలకు మనశ్శాంతి లేదు
పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా
ఎక్కడ శాంతిభద్రతలకు భంగం కలిగినా కలెక్టర్లు, ఎస్పీలు ఉపేక్షించవద్దు
నాకు, చంద్రబాబుకు అపార అవగాహన ఉంది.. విభేదాలు, అరమరికలు లేవు
ప్రజలు కూటమికి అండగా లేకపోతే మళ్లీ నియంతృత్వ పోకడలొస్తాయి
పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో పవన్
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్లేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ పనీ చేయలేదు. కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ల పని. ఇప్పుడు కూడా వైసీపీ చేష్టలు చూస్తుంటే ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. మెతగ్గా ఉండటంతో నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తున్నారు. ప్రజలు కూటమికి అండగా ఉండకపోతే మళ్లీ నియంతృత్వ పోకడలు వస్తాయి.
-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాకినాడ, జనవరి 9(ఆంధ్రజ్యోతి): వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిందని, ఇప్పుడు మళ్లీ పాత పద్ధతులు మొదలుపెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వం మెతగ్గా ఉండటంతో వైసీపీ నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తోందన్నారు. ఇదే విషయాన్ని పలుసార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని, ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కావడంతో నియంత్రణ పాటిద్దామని అంటున్నారని చెప్పారు. శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన పర్యటించారు. ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో పవన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం. ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్లేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ పనీ చేయలేదు. కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ల పని. వైసీపీ విషయంలో గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూటమికి అండగా ఉండకపోతే మళ్లీ నియంతృత్వ పోకడలు వస్తాయి. వైసీపీకి తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడమే. ఎక్కడ శాంతిభద్రతలకు భంగం కలిగినా కలెక్టర్లు, ఎస్పీలు ఉపేక్షించవద్దు. నా మాటలు మెతగ్గా ఉంటాయి. కానీ చేతలు గట్టిగా ఉంటాయి. రాజకీయాల్లో విమర్శలు చేయవచ్చు. కానీ కులాలు, మతాల మఽధ్య వివాదాలు రాజేస్తే పర్సనల్‌గా తీసుకుంటా. వ్యవస్థలకు ఎవరూ అతీతులు కాదు. పార్టీలు నన్ను, నా పార్టీని తిట్టినా ఫర్వాలేదు. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు తెస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని పవన్ హెచ్చరించారు.
కూటమిని బలహీనం చేయవద్దు
‘‘కూటమిని బలహీనం చేయవద్దు. నాకు, చంద్రబాబుకు మధ్య అపార అవగాహన ఉంది. మా మధ్య విభేదాలు, అరమరికలు లేవు. కొన్నిచోట్ల రెండుపార్టీల్లో నేతలు కూటమి నిలబడదని అంటుంటారు. పెన్షన్లు, 24గంటల్లో ధాన్యం డబ్బులు చెల్లించినా అంతా కూర్చుని చేసిందే. బలమైన పార్టీ, అనుభవం ఉన్న సీఎం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే టీడీపీని గౌరవిస్తా. అన్యాయం జరిగితే రోడ్డెక్కి పోరాడడం జనసేన బలం. నా సిద్ధాంతాలు నమ్మి పార్టీలో చేరే వాళ్లు ఊరికి పదిమంది ఉన్నా వెయ్యిమందితో సమానం. రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం చాలా అవసరం. ఆ అనుభవంతోనే 7లక్షల మంది రైతుల నుంచి 40లక్షల టన్నుల ధాన్యం సేకరించి రూ.9,300 కోట్లు చెల్లించగలిగాం. గత ప్రభుత్వంలో ధాన్యం బకాయిల కోసం దేహీ అని అడగాల్సిన పరిస్థితి కల్పించారు. ఎన్టీఆర్ భరోసా కింద 63 లక్షలమందికి నెలకు రూ.2,750 కోట్ల పింఛన్ డబ్బులు ఇస్తున్నాం. తల్లికి వందనం కింద రూ.10వేల కోట్లు జమ చేశాం. గత గతంలో అన్నా క్యాంటీన్లు తీసేశారు. కూటమి వచ్చాక 4 కోట్ల భోజనాలు అందించాం. గత ప్రభుత్వంలో రహదారులు దారుణంగా ఉండేవి. కేంద్రం జలజీవన్ మిషన్ కింద అప్పట్లో రాష్ట్రానికి రూ.25 వేల కోట్లు ఇస్తే రూ.4 వేల కోట్లే ఖర్చుచేశారు. రాష్ట్రవాటా రూ.2 వేలకోట్లే. మిగిలిన డబ్బు ఏంచేశారో తెలియదు. పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చారు డ్రైనేజీలు లేవు. రోడ్లు లేవు. లోతట్టు ప్రాంతాల్లో స్థలాలు అంటగట్టారు’’ అని పవన్ విమర్శించారు.
పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ
‘‘పిఠాపురం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదు. ఆఖరి శ్వాస వరకు మీకోసం పనిచేస్తా. దీనికి అధికారంతో సంబంధం లేదు. నాకు ఓటమి భయం లేదు. నాకు యుద్ధకళలు అంటే ఇష్టం. అందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా. పిఠాపురంలో మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఫైన్‌ఆర్ట్స్ అకాడమీ నా ట్రస్ట్ తరఫున నెలకొల్పాలని నిరయించాను. మార్చి 14న జనసేన ఆవిర్భావ సభను పిఠాపురంలోనే నిర్వహించాలని నిర్ణయించాం. నేను ఎక్కడ ఉన్నా పిఠాపురం నా గుండెల్లో ఉంటుంది’’ అని పవన్‌కల్యాణ్ తెలిపారు.
బాబాయ్‌ని హత్య చేసినా..
‘‘పిఠాపురం నా నియోజకవర్గం కావడంతో ఇక్కడ కొబ్బరిచెట్టు ఆకు పడినా, తాటాకు కింద పడినా, చెట్టుమీద నుంచి పక్షి ఈక రాలినా అమ్మో.. దారుణం అంటున్నారు. కానీ గత ప్రభుత్వ నేతల్లో వారి నియోజకవర్గాల్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనివ్వలేదు. పులివెందులలో బాబాయ్‌ను హత్య చేసినా ఆ విషయం బయటకు రానివ్వలేదు. కానీ పిఠాపురంలో ఓ స్కూల్లో ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే మాత్రం పెద్ద విషయం అయిపోతోంది. బడిపిల్లలు కొట్టుకున్న దానికి కులాలు అంటగడుతుంటే ఇంకేం చెప్పాలి. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా. పిడికెడు గింజలు పండించడం కష్టం. కానీ చేతికి వచ్చిన పంటను కూల్చడం సులువు. కూటమిని నిలబెట్టడం కష్టం. కానీ కష్టపడి దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే చెడగొట్టడం తేలిక. నేను మెత్తగా కనిపిస్తాననుకుంటున్నారు. కానీ నా మొండితనం గురించి ఎవరికీ తెలియదు. అధికారం ఉన్నా లేకున్నా నా జోలికి వస్తే ఊరుకోను. వ్యక్తిగతంగా నేను ఎవరితో గొడవ పెట్టుకోను. ఆవేదన, బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు సంపాదన కోసం కాదు. నేను పెద్ద యాక్టర్‌ను. నా సినిమాలు ఫ్లాప్ అయినా వాటికి డబ్బులు తీసుకునే సామర్థ్యం ఉంది. అయితే సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలనే వచ్చా. ఎవరైనా మతం, కులం, వర్గాల పేరుతో గొడవలు తెస్తే వారికి ప్రజలే బాధ్యత తెలియజేయాలి’’ అని పవన్ అన్నారు. ఆయన తన ప్రసంగంలో సరదాగా గోదారి యాసలో మాట్లాడారు. సంక్రాంతి అంటే కోడిపందేలు, పేకాటే కాదని, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలన్నారు.
కళాకారులతో కలసి పవన్ థింసా
పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన పవన్‌కు సంప్రదాయ నృత్యాలతో కళాకారులు స్వాగతం పలికారు. పవన్ ఆసక్తిగా తిలకించారు. వారితో సరదాగా కాసేపు ముచ్చటించి ఫొటోలు దిగారు. థింసా నృత్య కళాకారులతో కలిసి నృత్యం చేశారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే నానాజీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వర్మ తదితరులతో కలిసి సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. హరిదాసులకు పవన్ స్వయంపాకం దానం చేశారు. చిన్నారులకు భోగిపళ్లు వేశారు. రాట్నం ఒడికి చేనేత మగ్గాన్ని పరిశీలించారు. లేపాక్షి స్టాల్‌లో ఏటికొప్పాక బొమ్మల తయారీని పరిశీలించారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాలను పవన్ ప్రారంభించి ప్రసంగించారు. సభ ముగిసిన తర్వాత పిఠాపురం పట్టణంలో 40 నిమిషాల పాటు కాలినడకన పర్యటించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు.