Share News

వైసీపీ వాకౌట్‌ టాకౌట్‌ పార్టీ: పయ్యావుల

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:55 AM

వైసీపీ వాకౌట్‌, టాకౌట్‌ పార్టీగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో...

వైసీపీ వాకౌట్‌ టాకౌట్‌ పార్టీ: పయ్యావుల

అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): వైసీపీ వాకౌట్‌, టాకౌట్‌ పార్టీగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆయనపై మెజార్టీ వైసీపీ సభ్యులు దాడికి యత్నించారని, మంత్రులు సంధ్యారాణి తదితరులు వారికి అడ్డుగా నిలబడ్డారని తెలిపారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తిరుపతి లడ్డూపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం వ్యవసాయంపై మండలిలో చర్చ జరుగుతుందని తెలిపారు. లడ్డూ అంశంపై గురువారం దేవదాయ మంత్రి ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తే.. చదవడానికి వీల్లేదని, ముందుగా వైసీపీ సభ్యులు మాట్లాడాలని అడ్డుతగిలారన్నారు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన వేయాలి అనే ధోరణితోనే వైసీపీ సభ్యులు సభకు వచ్చి వాకౌట్‌ చేసి పోతున్నారని విమర్శించారు. వాళ్లకు చర్చ మీద అసలు ఆసక్తే లేదనడానికి సభలో జరిగిన సంఘటనే నిదర్శనమన్నారు. ‘వారు కోరిన ప్రకారమే వైసీపీ సభ్యులు అడిగిన అన్ని అంశాలను సభలో చర్చకు పెట్టాం. లా అండ్‌ ఆర్డర్‌, వ్యవసాయం తదితర అంశాలపై చర్చ పెట్టాం. సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం తిరుపతి లడ్డూపై చర్చకు కనీసం వైసీపీ నోటీసుకూడా ఇవ్వలేదు. సభలో రచ్చ చేయాలన్నదే వాళ్ల ఉద్దేశం. చర్చ జరగాలని కాదు. వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చ జరిపేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి రెండు గంటల వరకూ అయినా చర్చకు సిద్ధం’ అని పయ్యావుల తెలిపారు. వైసీపీ సభలో ఆత్మరక్షణలో పడిందని, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి భంగపడిందని ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 27 , 2026 | 04:57 AM