Share News

ఎడాపెడా దోచేశారు

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:25 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ అవినీతి బయటపడింది. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వేల కోట్లు కొట్టేసిన విషయం వెలుగుచూసింది. ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంలో అడ్వాన్స్‌ పేరుతో కాంట్రాక్టర్లు ముందస్తుగా డబ్బు తీసుకున్నారు.

ఎడాపెడా దోచేశారు

  • పేదల ఇళ్ల నిర్మాణంలో అంతులేని దోపిడీ

  • వైసీపీ హయాంలో వేల కోట్ల అవినీతి

  • విజిలెన్స్‌ ప్రాథమిక నివేదికలో బట్టబయలు

  • అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు

  • ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లకు ముందుగానే నిధులు

  • ఆప్షన్‌-3 ఇంటికి 90 వేల వరకు అడ్వాన్స్‌

  • డబ్బు తీసుకుని పనులు చేయని కాంట్రాక్టర్లు

  • కమీషన్లు తీసుకుని మిన్నకున్న అధికారులు

  • అధికారులకు కార్పొరేషన్‌ షోకాజ్‌ నోటీసులు

  • కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయకపోతే జీతాల నుంచి వసూలు చేస్తామని హెచ్చరిక

  • పనులు చేయని కాంట్రాక్టర్లపై కేసులకు ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మరో భారీ అవినీతి బయటపడింది. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ వేల కోట్లు కొట్టేసిన విషయం వెలుగుచూసింది. ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణంలో అడ్వాన్స్‌ పేరుతో కాంట్రాక్టర్లు ముందస్తుగా డబ్బు తీసుకున్నారు. కమీషన్ల కక్కుర్తితో అధికారులు వారికి సహకరించారు. ఇద్దరూ కుమ్మక్కై భారీగా దోచేసి చివరికి ఇళ్లు నిర్మించకుండానే వదిలేశారు. ఈ వ్యవహారాన్నంతటినీ క్షుణ్ణంగా పరిశీలించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక రాష్ట్ర గృహనిర్మాణ శాఖలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అడ్డగోలుగా సాగిన ఈ దోపిడీ వ్యవహారంపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి తదితరులు ఫిర్యాదులు చేయడంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కాంట్రాక్టర్లు, హౌసింగ్‌ అధికారులు కలిసి సాగించిన అవినీతి తీరుపై విజిలెన్స్‌ ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. అక్రమాలకు పాల్పడిన అధికారుల జాబితాను రూపొందించి, వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.


హౌసింగ్‌ అధికారుల సహకారంతో భారీ మొత్తాల్లో ముందుగానే బిల్లులు తీసేసుకుని పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వని కాంట్రాక్టర్ల నుంచి అదనపు మొత్తాలను రికవరీ చేయాలని కూడా విజిలెన్స్‌ సిఫారసు చేసింది. అక్రమాలకు పాల్పడిన హౌసింగ్‌ ఏఈలు, డీఈలు, డీఈఈలు, ఈఈలు, డీహెచ్‌హెచ్‌లతో పాటు పదవీ విరమణ చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేస్తూ రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ అరుణ్‌బాబు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. పలు జిల్లాలో 300 నుంచి 400 మందికి పైగా హౌసింగ్‌ ఇంజినీర్లు, వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీలకు ఈ షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఇళ్లు నిర్మించని కాంట్రాక్టర్లతో వెంటనే వాటిని పూర్తి చేయించాలని లేదా వారికి అదనంగా చెల్లించిన ప్రభుత్వ ధనాన్ని కాంట్రాక్టర్ల నుంచి రికవరీ చేయాలని ఆ షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. లేకపోతే సంబంధిత ఇంజినీర్ల జీతాల నుంచి లేదా రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ నుంచి రికవరీ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. షోకాజ్‌ నోటీసులకు ఏడు రోజుల్లోగా తగిన వివరణ ఇవ్వకపోతే.. వెంటనే చార్జిమెమోలు జారీ చేసి ఉద్యోగాల నుంచి తొలగించడానికి కూడా వెనకాడబోమంటూ రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అజయ్‌ జైన్‌ ఇటీవల జూమ్‌ మీటింగ్‌ పెట్టి క్షేత్రస్థాయి అధికారులకు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అడ్వాన్స్‌ తీసుకుని ఇళ్లు కట్టకుండా పోయిన కాంట్రాక్టర్లపై కూడా ఎక్కడికక్కడ పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టాలంటూ మౌఖిక ఆదేశాలు జారీచేశారు.

కాంట్రాక్టర్లంతా వైసీపీ వాళ్లే

ఇళ్లు కట్టుకోలేని పేదలకు ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని నాడు జగన్‌ ఇచ్చిన హామీతో రాష్ట్రవ్యాప్తంగా 3.51 లక్షల మంది నిరుపేద లబ్ధిదారులు ఆప్షన్‌-3ని ఎంపిక చేసుకున్నారు. ఈ ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు అప్పగించారు. ప్రభుత్వ పెద్దలు చెప్పారని హౌసింగ్‌ అధికారులు నిబంధనలను పక్కనబెట్టి టెండర్లు, అగ్రిమెంట్లు, పూచీకత్తులు (ఈఎండీ) ఏమీ లేకుండానే రూ.వేల కోట్ల విలువైన పనులను వైసీపీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేశారు. కాంట్రాక్టర్లకు ముందుగానే ఒక్కో ఇంటికి బేస్‌మెంట్‌ నిర్మాణానికే రూ.70 వేలు చొప్పున అడ్వాన్సులు చెల్లించారు. ఆపై అత్యంత నాసిరకంగా బేస్‌మెంట్లు నిర్మించి, వాటిలో మట్టి కూడా నింపకుండా వదిలేశారు. ఈ అక్రమాలన్నీ కళ్ల ముందు కనబడుతున్నా హౌసింగ్‌ అధికారులు తర్వాతి దశల (బీమ్‌, లింటెల్‌) కోసం మళ్లీ ఒక్కో ఇంటికి రూ.20వేలు చొప్పున మరోసారి కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించారు. పేదలకు నిర్మించే ఒక్కో ఇంటి యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు కాగా.. వాటి పనులు జరగకుండానే హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు అడ్వాన్సుల కింద ఒక్కో ఇంటికి రూ.90 వేలు చొప్పున కాంట్రాక్టర్లకు చెల్లించేశారు. సగం డబ్బులు అడ్వాన్సుల కింద తీసేసుకున్న కాంట్రాక్టర్లు తర్వాత తూతూ మంత్రంగా గోడలు కట్టేసి వెళ్లిపోయారు. దాంతో ఆప్షన్‌-3 ఇళ్లు దాదాపుగా పునాదులకే పరిమితమయ్యాయి.


ఒక్క రాక్రీట్‌ సంస్థకు దోచిపెట్టిందే 80 కోట్లు

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బంధువులకు చెందిన రాక్రీట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఏడు జిల్లాల్లో ఏకంగా 51,633 ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ సంస్థ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోయినా హౌసింగ్‌ అధికారులు ఏకంగా రూ.80.53 కోట్లకుపైగా ప్రభుత్వ ధనాన్ని అదనంగా చెల్లించారు. ఈ డబ్బును రికవరీ చేయాలని ప్రభుత్వానికి విజిలెన్స్‌ సిఫారసు చేసింది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇళ్లు నిర్మించకుండానే 178 మంది కాంట్రాక్టర్లకు రూ.63 కోట్లు అదనంగా చెల్లించారు. ఇది కాకుండా గతంలో కట్టుకున్న పాత ఇళ్లకు కూడా హౌసింగ్‌ అధికారులు రూ.36 కోట్లకు పైగా బిల్లులు మంజూరు చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. నెల్లూరు జిల్లాకు చెందిన జేఎన్‌ఆర్‌ కనస్ట్రక్షన్స్‌ సంస్థకు 10 జిల్లాల్లో 75 వేలకు పైగా ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. అజాయా వెంచర్స్‌కు పలు జిల్లాల్లో 23వేలకు పైగా ఇళ్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. పలు జిల్లాల్లో వైసీపీ వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చారు. గత ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో కాంట్రాక్టులు పొందిన వీరంతా రూ.వందల కోట్లలో అడ్వాన్సులు, మెటీరియల్స్‌ తీసేసుకుని ఇళ్లు నిర్మించకుండా చేతులెత్తేశారు. అలాంటి కాంట్రాక్టర్లందరిపై కేసులు పెట్టాలని జిల్లా అధికారులకు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఏలూరు జిల్లా హౌసింగ్‌ అధికారులు అజాయా వెంచర్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన కాంట్రాక్టర్లపైనా కేసులు పెట్టేందుకు ఆయా జిల్లాల హౌసింగ్‌ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు సెంట్రల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో దాదాపు 30వేల టన్నుల స్టీలు, భారీ మొత్తంలో సిమెంట్‌ ఒకేసారి కొనుగోలు చేసేశారు. కమీషన్ల కోసం దాదాపు రూ.25 వేల కోట్లకుపైగా విలువైన మెటీరియల్‌ను గొడౌన్లలో డంప్‌ చేశారు. ఇప్పుడదంతా తుప్పుబట్టి ఎందుకూ కాకుండా పోతోంది. ఈ మెటీరియల్‌ దాచడానికి తీసుకున్న గొడౌన్లకు హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రతి నెలా రూ.10 కోట్ల చొప్పున అద్దె చెల్లిస్తూ వస్తున్నారు.


కట్టినవి 5 లక్షల ఇళ్లే

జగన్‌ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌, గ్రామీణ్‌) పథకం కింద రాష్ట్రానికి 23 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వైసీపీ దిగిపోయే నాటికి కేవలం 5 లక్షల ఇళ్లను మాత్రమే పూర్తి చేసింది. మౌలికసదుపాయాలు కల్పించకపోవడంతో ఆ ఇళ్లన్నీ నిరుపయోగంగా పడిఉన్నాయి. మిగిలిన 18 లక్షల ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయినప్పటికీ ఆ ఇళ్లను పూర్తి చేస్తున్నట్లుగా హౌసింగ్‌ అధికారులు ఆన్‌లైన్‌లో స్టేజ్‌ అప్‌డేషన్‌ చేసేస్తూ.. వాటికి నిధులను డ్రా చేసేసుకున్నారు. పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చే సబ్సిడీ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో.. ఆ నిధులను ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి బదిలీ చేసుకునేలా బ్యాంకుతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా రూ. వేల కోట్లను అక్రమ పద్ధతుల్లో కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు. తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల రూపంలో రూ. కోట్లలో కూడబెట్టుకున్నారు.

తప్పులన్నీ కిందిస్థాయి అధికారులవేనా?

వైసీపీ నాయకులతో కుమ్మక్కై అడ్డగోలు కార్యకలాపాల ద్వారా మొత్తం గృహ నిర్మాణ పథకాన్ని పక్కదారి పట్టించడానికి పూర్తిగా అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బాధ్యుడని, ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అక్రమాలు జరిగినప్పుడు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఐఏఎస్‌ అధికారి భరత్‌ గుప్తా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నీ అప్పుడు, ఇప్పుడూ కూడా గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌జైన్‌ నోటీసులో ఉన్నాయని విజిలెన్స్‌ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్‌ రిపోర్టు ఆధారంగా అక్రమార్కులపై చర్యలకు ఆదేశించడంతో.. మొత్తం తప్పులన్నింటినీ క్షేత్రస్థాయిలోని హౌసింగ్‌ అధికారులపైకి నెట్టేసి ఉన్నతాధికారులు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని జిల్లాల్లో షోకాజ్‌ నోటీసులు అందుకున్న ఇంజినీర్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతస్థాయి నుంచి ఎప్పటికప్పుడు జారీ చేసిన ఆదేశాలనే తాము అనుసరించామని, కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసే అధికారం తమకు లేదని వారు స్పష్టం చేస్తున్నారు. తమకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఉపసంహరించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని వారంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - Feb 11 , 2026 | 04:25 AM