Share News

వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అందని ఫలాలు

ABN , Publish Date - May 07 , 2026 | 03:56 AM

గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందాల్సిన పథకాలు గత ఐదేళ్లు రాష్ట్రంలోని మైనార్టీలకు అందకుండా పోయాయని శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌...

వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు అందని ఫలాలు

  • శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌ నసీర్‌ అహ్మద్‌ ధ్వజం

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ తీరు వల్లే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అందాల్సిన పథకాలు గత ఐదేళ్లు రాష్ట్రంలోని మైనార్టీలకు అందకుండా పోయాయని శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ విమర్శించారు. బుధవారం అసెంబ్లీ హాల్‌లో మైనార్టీ సంక్షేమ పథకాల అమలుపై ఆయన అధ్యక్షతన సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మైనార్టీలకు సామాజికం, ఆర్థికంగా అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మైనార్టీ వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ యోజనతోపాటు, వివిధ పథకాలకు సంబంధించి రూ.275 కోట్లు మంజూరయ్యాయని, వాటికి యూసీ (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌)లు సమర్పించకుండా, మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకపోవడంతో ఆ నిధులు నిలిచిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీఎం చంద్రబాబు రూ.275 కోట్ల నిధులు విడుదల చేయించారని చెప్పారు. ముస్లింల సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లతో అనేక డీపీఆర్‌లు సిద్ధం చేశామన్నారు. ఆ నిధులతో గుంటూరులోని వెల్ఫేర్‌ సెంటర్‌ స్థలంలో ప్రభుత్వాస్పత్రి భవనాలు, నంద్యాలలో హాస్టళ్ల నిర్మాణం వంటివి చేయనున్నట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇమామ్‌, మౌజన్లకు ఇవ్వకుండా నిలిపివేసిన గౌరవ వేతనం బకాయిలతో కలిపి రూ.153 కోట్లను తమ ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న అనేక మసీదులు, చర్చిలకు సైతం సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో వాటికి పొజిషన్‌ సర్టిఫికెట్లు ఇప్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని చెప్పారు.

Updated Date - May 07 , 2026 | 03:56 AM