హెరిటేజ్‌పై వైసీపీ దుష్ప్రచారం
ABN , Publish Date - Feb 23 , 2026 | 05:11 AM
తిరుమల లడ్డూ వివాదంతో ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు.
అత్యంత నీచమైన పాపం చేసి ఎదురుదాడి.. హిందూ దేవుళ్లపై జగన్‌కు విశ్వాసం లేదు
స్వామి ఆగ్రహానికి గురైతే వైసీపీకి భవిష్యత్తు ఉండదు
తిరుమల ఊసెత్తే అర్హత జగన్‌కు లేదు
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆగ్రహం
హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్న వైసీపీ: బొలిశెట్టి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
తిరుమల లడ్డూ వివాదంతో ఎటువంటి సంబంధం లేని హెరిటేజ్ కంపెనీపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చెప్పులు వేసుకుని స్వామివారి పటాలను ఊరేగించి, దేవదేవుడికి అపచారం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మంత్రులు విలేకరులతో మాట్లాడారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ హెరిటేజ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారంపై మండిపడ్డారు. లడ్డూ విషయంలో అత్యంత నీచమైన పాపంచేసి మళ్లీ సిగ్గూ.. లజ్జా లేకుండా వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారన్నారు. అప్పటి టీటీడీ చైర్మనే లడ్డూలో కల్తీ జరిగిందని చెబుతున్నా, సీబీఐ రిపోర్టు అంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే దుర్మార్గ ప్రచారం చేస్తున్నారన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ కౌన్సిల్‌లో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరును ప్రజలందరూ గమనించాలని కోరారు. హిందూమతం, హిందువుల ఆచారాలు, దేవుళ్లపై జగన్మోహన్‌రెడ్డికి ఏమాత్రం విశ్వాసంలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చెప్పులు వేసుకుని స్వామి చిత్రపటాలను ప్రదర్శించడం ద్వారా నీచ రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. స్వామివారి చిత్రపటాలను అక్కడే చెల్లాచెదురుగా పడేసి వేంకటేశ్వరస్వామిని అవహేళన చేయడం క్షమార్హం కాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం వైసీపీ నాయకులు వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం సిగ్గుచేటని మంత్రి డీఎ్‌సబీవీ స్వామి మండిపడ్డారు. దేవుడితోపెట్టుకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్‌తో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు.
వైసీసీ హయాంలో జగన్ తన చిన్నాన్నను టీటీడీ చైర్మన్‌గా నియమించి అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో టీటీడీలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని దుయ్యబట్టారు. వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్న అకౌంట్‌లోకి రూ.4.69 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని మంత్రి డి మాండ్ చేశారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందన్న సాకుతో.. దర్శనాన్నే మానుకున్న జగన్‌రెడ్డికి తిరుమల ఊసెత్తే అర్హత లేదని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయిన ఈ 18 నెలల కాలంలో జగన్‌రెడ్డి ఒక్కసారి కూడా స్వామిని దర్శించుకోలేదన్నారు. స్వామి వారికి తాను చేసిన అపకారం... అపచారం గుర్తొచ్చే జగన్ దర్శనానికి వెళ్లడం లేదన్నారు. చట్టసభల్లో దేవదేవుడిని అవమానించేలా వ్యవహరించిన జగన్‌రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవస్థానం మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన వ్యక్తి జగన్‌రెడ్డి అన్నారు. చట్టసభల్లోకి వేంకటేశ్వరస్వామి ఫొటోలు తీసుకొచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఐదేళ్లలో టీటీడీ నిధుల్ని తిరుపతి కార్పొరేషన్‌కు డైవర్ట్ చేసుకున్నారన్నారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాములవారి ప్రసాదానికి కూడా కల్తీ లడ్డూలే పంపించారని, ప్రధాన మంత్రికి కూడా కల్తీ లడ్డూలే పెట్టారన్నారు. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ జగన్‌రెడ్డి అరాచకాలు అన్నీ బయటపడటంతో తప్పించుకునేందుకు హెరిటేజ్‌పై నిందలేస్తున్నారన్నారు. హిందువుల మనోభావాలను వైసీపీ దెబ్బతీస్తున్నదని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నెల్లూరులో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడితో కూడా రాజకీయాలు చేసే వైసీపీ నేతల వైఖరిని ఖండిస్తున్నామన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వైసీపీ చేసే కార్యక్రమాలను కూటమి నాయకులు ప్రజలకు తెలియజేయాలన్నారు. వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
రాష్ట్రంలో నెయ్యి కథ నడుస్తోంది
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
విజయనగరం, ఫిబ్రవరి 22( ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విచిత్రంగా నెయ్యిపై కథ నడుస్తోందని, స్వచ్ఛమైన పాల నుంచి నెయ్యి తయారవుతుందని అందరికీ తెలిసిందేనని, ఈ విషయం మరిచిపోయేలా గత పాలకులు వ్యవహరించారని గోవా గవర్నర్, మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజు విమర్శించారు. విజయనగరం కోటలో ఆదివారం ఆయన మాట్లాడారు. నెయ్యి సరఫరా విషయంలో గత పాలకులు అనాలోచితంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది బాలలు బడి బయట ఉండిపోయారని, ఇందుకు కారణం ఆ ప్రభుత్వ విధానాలేనని అన్నారు. గత పాలకులు మాన్సా్‌స్‌పై కక్ష గట్టారని, ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి తీసుకువచ్చారన్నారు. మాన్సా్‌సకు శిస్తులు కట్టకూడదని ఆదేశాలు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు మంచి విధానాలతో ముందుకు వెళితే, ఆ రాష్ట్రం, ప్రజలు బాగుంటారన్నారు. మాన్సాస్ సంస్థలు సుదీర్ఘకాలం విలువలతో కూడిన విద్యను అందించాలని, అందుకు అనుగుణంగా మంచి ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
