ప్రజా తిరుగుబాటుతో వైసీపీ తోక ముడిచింది
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:01 AM
అమరావతిలో జరిగిన ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోకముడిచాయని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
గందరగోళం సృష్టికే కొత్త నాటకాలు: మంత్రి గొట్టిపాటి
అమరావతి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో జరిగిన ప్రజా తిరుగుబాటుతో వైసీపీ అల్లరి మూకలు తోకముడిచాయని రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కుట్రల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నించిన వైసీపీ నేతలను అమరావతి మహిళలు, రైతులు గట్టిగా నిలదీసి వెనక్కి పంపారని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయాల పేరుతో నేరాలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలు కూడా అదే స్పష్టతతో ఉన్నారనడానికి శనివారం అమరావతిలో జరిగిన ఘటనే నిదర్శనమని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వం అమరావతిలో ఎక్కడా గుప్పెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. అధికారం కోల్పోయాక వైసీపీ నాయకత్వం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కొత్త కొత్త నాటకాలకు తెరలేపుతోందని ధ్వజమెత్తారు. ఏ అంశంపైనా స్థిరమైన వైఖరి లేకుండా ప్రజలను మభ్యపెట్టడమే ఆ పార్టీ లక్ష్యంగా మారిందన్నారు.