Share News

జెన్‌-జీ కాదు.. ‘జెన్‌-జే’

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:03 AM

తమ పాలనలో నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే.. ఆ ఘనత తమదే అంటూ జగన్‌ పార్టీ గొప్పలకు పోతోంది. అంటే.. క్రెడిట్‌ చోరీ అన్నమాట. అలాగే.. జెన్‌-జీ ఉద్యమాన్ని కాపీ కొట్టేందుకు..

జెన్‌-జీ కాదు.. ‘జెన్‌-జే’

  • కాపీ కొట్టబోయి జగన్‌ పార్టీ అభాసుపాలు.. డీఎస్సీ అక్రమాలంటూ దీక్షలు

  • అటు చూడని విద్యార్థులు, అభ్యర్థులు.. శిబిరాల్లో వైసీపీ నేతలు, శ్రేణులే

  • యుక్త వయసు దాటినవారితో ఏపీ జెన్‌-జీ వార్‌ అంటూ హడావుడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తమ పాలనలో నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే.. ఆ ఘనత తమదే అంటూ జగన్‌ పార్టీ గొప్పలకు పోతోంది. అంటే.. క్రెడిట్‌ చోరీ అన్నమాట. అలాగే.. జెన్‌-జీ ఉద్యమాన్ని కాపీ కొట్టేందుకు, కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టేందుకు నానా పాట్లు పడుతోంది. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు స్పందించకపోయినా.. జగన్‌ తమ పార్టీకి చెందిన నేతలను జెన్‌-జే(జగన్‌ బ్యాచ్‌)లుగా రంగంలోకి దింపారు. పైకిమాత్రం ఏపీ జెన్‌-జీ వార్‌ అంటూ హడావుడి చేస్తున్నారు. జగన్‌ చేస్తున్న విన్యాసాలు చివరకు అభాసుపాలవుతున్నాయి. నీట్‌ పరీక్షా పత్రం లీకేజీ ఘటన తర్వాత ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమం ఉవ్వెత్తున వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. విద్యార్థులు జెన్‌-జీ పేరిట కేంద్రంలో కదలిక తీసుకువచ్చారు. ఈ ఉద్యమాన్ని అనుసరించాలని భావించిన జగన్‌.. వైసీపీలోనూ జెన్‌-జీలు ఉన్నారంటూ తన పార్టీకి చెందినవారిని రంగంలోకి దింపారు. మొదట డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేశారు. జగన్‌ చేసిన ఆరోపణలన్నింటికీ ప్రభుత్వం సవివరంగా సమాధానాలు చెప్పింది. ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. అయినా డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఉద్యమిస్తుందంటూ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్త రిలే దీక్షలకు పిలుపునిచ్చారు. తీరా రిలే దీక్షల్లో పాల్గొన్నవారిని చూసి అందరూ విస్తుపోతున్నారు. వైసీపీ దీక్షల్లో ఎక్కడా డీఎస్సీ అభ్యర్థులు కానీ, విద్యార్థులు కానీ లేరు. వైసీపీకి చెందిన వెంట్రుకలు నెరిసిన నేతలు, గడ్డాలున్న మధ్య వయసువారు, మహిళలే శిబిరాల్లో కనిపించారు. దీక్షల్లో పాల్గొన్నవారందరూ జెన్‌-జీలు కాదు జెన్‌-జేలే. అయినా జెన్‌-జీ ఉద్యమమంటూ ఒక్కటే ఆర్భాటం. అక్కడక్కడ మాత్రం కొందరు యవకులను పోగేశారు. నీట్‌ పేపర్‌ లీక్‌ అయిందని తేలడంతో కేంద్రం రద్దు చేసింది.


విద్యార్థుల ఉద్యమం తీవ్రం కావడంతో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. కానీ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించారు. ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా టీచర్‌ పోస్టులు భర్తీ చేశారు. రిజర్వేషన్ల విధానంపై కొందరు అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేయగా ప్రభుత్వం అన్నింటికీ స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్‌ పిలుపునిచ్చిన ఉద్యమానికి డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థుల నుంచి స్పందన రాలేదు. వాస్తవానికి డీఎస్సీలో అక్రమాలంటూ జగన్‌ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. అయినా మంత్రి లోకేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. కోర్టులో కేసులు వేయించాలని కూడా చూశారు. చివరకు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. మళ్లీ రెండు రోజులుగా నియోజకవర్గాల్లో రిలే దీక్షలు చేపడుతున్నారు. శుక్రవారం ఎక్కడ చూసినా యుక్త వయసు దాటిన జెన్‌-జే బ్యాచే కనిపించారు. మచ్చుకు కొన్ని ఉదాహరణలు..


  • గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన రిలే నిరాహార దీక్షలో ఒక్క డీఎస్సీ అభ్యర్థి కూడా లేరు. మొత్తం వైసీపీ నాయకులే. గుంటూరు వైసీపీ తూర్పు మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషా నిరాహార దీక్ష చేయగా ఆ పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, ప్రభు, బత్తుల దేవానంద్‌, యువజన విభాగం నాయకుడు శశిధర్‌ పలువురు సంఘీబావం తెలియజేశారు. అయినా ఏపీ జన్‌-జీ వార్‌ రిలే నిరాహార దీక్షలు అంటూ ఫ్లెక్సీలు కట్టి హడావుడి చేశారు.

  • మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, రాయచోటి నియోజకవర్గాల కేంద్రాల్లో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన రిలే దీక్షల్లో అందరూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, యువకులు, బయటి వ్యక్తులు ఎవరూ లేరు.

  • అనంతపురంలో చేపట్టిన రిలే దీక్షలో వైసీపీ, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మాత్రమే ఉన్నారు. ఇతరులు ఎవరూ లేరు.

  • తిరుపతి జిల్లాలో వైసీపీ రిలే దీక్షల్లో డీఎస్సీ అభ్యర్థులు కానీ, యువత కానీ పాల్గొనలేదు. అందరూ ఆ పార్టీకి చెందినవారే ఉన్నారు.

  • విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్‌ బాపిస్టుపాలెంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. దీక్షకు కూర్చున్నవారిలో గంజాయి బ్యాచ్‌ కూడా ఉన్నారు. కేసులు కూడా నమోదయ్యాయి. డీజేలు ఏర్పాటు చేసి వైసీపీ పాటలతో చప్పట్లు కొడుతూ, గంతులేస్తూ రోడ్డుపై గందరగోళం సృష్టించారు. వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తూ హడావుడి చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 08 , 2026 | 05:04 AM