Share News

YSRCP: ఉల్టా.. పల్టా!

ABN , Publish Date - Jan 11 , 2026 | 03:08 AM

ఒకే పార్టీ... ఒకటే అంశం! కానీ... ఒకసారి ‘జై’ కొడతారు! అంతలోనే... ‘నై’ అంటారు! ఒకరొచ్చి ‘నో’ అంటారు! ఇంకొకరేమో ‘ఎస్‌’ చెబుతారు. గంటల్లోనే ప్లేటు తిరగేస్తారు! తూచ్‌...

YSRCP: ఉల్టా.. పల్టా!

  • అమరావతిపై వైసీపీ తికమక

  • ఇక్కడ కట్టొద్దంటూ జగన్‌ హూంకరింపు

  • రివర్‌ బేసిన్‌ పేరుతో బెదిరింపు

  • 48 గంటల్లోనే తెరపైకి వచ్చిన సజ్జల

  • ‘స్వాగతిస్తున్నాం’ అని ప్రకటన

  • రివర్‌ బేసిన్‌ మాటెత్తని వైనం

  • అమరావతి రైతులపై ‘ప్రేమ’

  • ఖర్చు, అవినీతి అంటూ పాతకథలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకే పార్టీ... ఒకటే అంశం! కానీ... ఒకసారి ‘జై’ కొడతారు! అంతలోనే... ‘నై’ అంటారు! ఒకరొచ్చి ‘నో’ అంటారు! ఇంకొకరేమో ‘ఎస్‌’ చెబుతారు. గంటల్లోనే ప్లేటు తిరగేస్తారు! తూచ్‌... అలాకాదని తికమక పెడతారు! ఇది... ‘రాజధాని అమరావతి’పై వైసీపీ వైఖరి. మొన్నటికి మొన్న... ‘అమరావతిని రివర్‌ బేసిన్‌లో కడుతున్నారు. అలా కట్టేందుకు వీల్లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి’ అని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. సరిగ్గా 48 గంటల్లో అదే పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందుకొచ్చి ‘రాజధాని అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. అమరావతిని మేము వ్యతిరేకించలేదు. చంద్రబాబు చేస్తున్న స్కామ్‌లనే ప్రశ్నిస్తున్నాం’’ అని చెప్పారు. అమరావతిపై జగన్‌ చేసిన వ్యాఖ్యలతో రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందని గ్రహించే... సజ్జల హఠాత్తుగా తెరపైకి వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


ఒక్కోసారి ఒక్కో మాట

అమరావతిపై వైసీపీది ఆది నుంచీ మోసపూరితమైన వైఖరే! ‘అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం’ అని అసెంబ్లీ వేదికగా జగన్‌ చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అమరావతిని కదిలించబోమని, జగన్‌ ఇక్కడ ఇల్లు కట్టుకోవడమే దీనికి నిదర్శనమని వైసీపీ నేతలు నమ్మబలికారు. కానీ... అధికారంలోకి రాగానే మూడు ముక్కలాటకు తెరలేపారు. విచిత్రమేమిటంటే... ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత సజ్జల కూడా ఇదే మాట చెప్పడం! ‘‘ఈ ప్రాంతంపై జగన్‌కు వ్యతిరేకత లేదు. పైగా అభిమానిస్తారు. ఆయన సీఎం కాకముందే ఇక్కడ ఇల్లు, కార్యాలయం కట్టడమే దీనికి నిదర్శనం’ అని మరోసారి మభ్యపెట్టేలా మాట్లాడారు. రాజధానిని రివర్‌ బేసిన్‌లో కడుతున్నారని, ఇది సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని జగన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కానీ... శనివారం మీడియాతో మాట్లాడిన సజ్జల ‘రివర్‌ బేసిన్‌’ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. అంటే... జగన్‌ లేవనెత్తిన రివర్‌ బేసిన్‌ వాదన తప్పే అని పరోక్షంగా అంగీకరించినట్లేనా!? ఇక... అమరావతిలో నీళ్లు తోడిపోసేందుకు వందలకోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. జీఏడీ టవర్ల కోసం తవ్విన పునాదుల్లో నిలిచిన నీళ్లను తోడేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దీనికి కారణమెవరు? అమరావతిలో నిర్మాణాలను వైసీపీ ఎక్కడికక్కడ వదిలేయడమే కదా!? ‘అమరావతిని ఎప్పుడూ తక్కువగా చూడలేదు’ అని కూడా సజ్జల చెప్పారు. తాము అధికారంలో ఉండగా వైసీపీ నేతలు అమరావతిని శ్మశానంతో పోల్చిన విషయాన్ని మరిచిపోయారు.


ఐదేళ్ల విధ్వంసం వదిలి...

సజ్జల తన ప్రెస్‌మీట్‌లో రాజధాని రైతులపై ప్రేమ కురిపించారు. వారి ప్లాట్లు అభివృద్ధి చేయలేదని, రోడ్లు వేయలేదని ఒకింత ఆవేదన ప్రదర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ రాజధాని రైతులకు వైసీపీ నరకం చూపించింది. కేసులుపెట్టింది. రోడ్లెక్కకుండా అడ్డుకుంది. అవమానించింది. అవన్నీ మరిచిపోయి... ఇప్పుడు రాజధానిలో ప్లాట్లను అభివృద్ధి చేయలేదని సజ్జల ఆరోపించడమే విచిత్రం. వైసీపీ హయాంలో అమరావతి అడవిని తలపించింది. రోడ్లను తవ్వేసుకుని, గ్రావెల్‌ ఎత్తుకుపోయారు. పైపులను దొంగిలించారు. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... అరాచక శక్తులను ప్రోత్సహించింది. ఇప్పుడు... సజ్జల మీడియా ముందుకు వచ్చి ‘మేం ఈ ప్రాంతాన్ని తక్కువ చేయలేదు’ అని చెబితే నమ్మేదెలా? పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశమున్నా, చంద్రబాబు ఇక్కడికి వచ్చేశారంటూ సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినా ‘పరాయి’ పంచనుంచే పాలన సాగాలన్న కోరికేమిటో మరి! ఉమ్మడి రాజధానిలోనే ఉండి ఉంటే... ఇక్కడ పదేళ్లు సహజంగా అభివృద్ధి జరిగేదని వింత వాదన చేశారు. పరిపాలనను స్వరాష్ట్రానికి తరలించుకుంటే అభివృద్ధి జరుగుతుంది కానీ... పక్క రాష్ట్రం నుంచి పాలిస్తే జరిగే అభివృద్ధి ఏమిటో ఆయనకే తెలియాలి. అమరావతి కోసం అన్ని కోట్లు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారన్నది సజ్జల ఆక్రోశం! జగన్‌ అధికారంలో వచ్చేనాటికి అమరావతిలో పది వేలకోట్లకు పైగా విలువైన పనులు జరిగాయి. అయినా అమరావతిని అటకెక్కించడం, ఆ నిర్మాణాలను ఎలా వాడుకుంటారో చెప్పకపోవడం ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అనే ప్రశ్నకు సజ్జల సమాధానమేమిటో! సచివాలయంతోపాటు హెచ్‌వోడీలు ఒకే చోట ఉండేలా నిర్మిస్తున్న జీఏడీ టవర్ల విస్తీర్ణంపైనా సజ్జల తనదైన లెక్కలు చెప్పారు.

Updated Date - Jan 11 , 2026 | 03:10 AM