తిరుమలపై వైసీపీ కుట్ర: భాను ప్రకాశ్
ABN , Publish Date - Jan 13 , 2026 | 06:59 AM
హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల లక్ష్యంగా వైసీపీ శక్తులు వ్యవస్థీకృత కుట్రలు చేస్తున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): హిందువుల పవిత్ర క్షేత్రమైన తిరుమల లక్ష్యంగా వైసీపీ శక్తులు వ్యవస్థీకృత కుట్రలు చేస్తున్నాయని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు కిలారు దిలీప్, అడ్డూరి శ్రీరామ్‌తో కలసి విలేకర్లతో మాట్లాడారు. దేవ దేవుడి సొమ్ము దొంగిలిస్తే... అదేదో చిన్న దొంగతనంగా అభివర్ణిస్తూ, దొంగలించిన వ్యక్తినే స్వామి భక్తుడిని చేశారంటూ మండిపడ్డారు. చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని జగన్ పార్టీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 2019 నుంచి 2024 వరకూ ధార్మిక క్షేత్రంలో అనేక దాపరికాలు, అక్రమాలు జరిగాయన్న బోర్డు సభ్యుడు... భూమన కరుణాకర్ రెడ్డి సహా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని హెచ్చరించారు. టీటీడీ నిబంధనల మేరకే జంగా కృష్ణమూర్తికి స్థలం కేటాయింపును వ్యతిరేకించామని భాను ప్రకాశ్ స్పష్టం చేశారు.