Share News

ప్రాణాలతో ఎలా తిరుగుతావో చూస్తా

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:46 AM

‘నన్ను జైలుకు పంపావు.. నువ్వు ప్రాణాలతో ఎలా తిరుగుతావో చూస్తా’ అంటూ వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ మాలపాటి భాస్కర్‌రెడ్డి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను బెదిరించాడు.

ప్రాణాలతో ఎలా తిరుగుతావో చూస్తా

  • ఎమ్మెల్యే ‘బోడె’కు వైసీపీ నేత భాస్కర్‌రెడ్డి బెదిరింపు

విజయవాడ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘నన్ను జైలుకు పంపావు.. నువ్వు ప్రాణాలతో ఎలా తిరుగుతావో చూస్తా’ అంటూ వైసీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ మాలపాటి భాస్కర్‌రెడ్డి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను బెదిరించాడు. దీనిపై బోడె పెనమలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లండన్‌లో ఉండే భాస్కర్‌రెడ్డి.. చంద్రబాబు, పవన్‌ కుటుంబసభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఆయన లండన్‌ నుంచి యనమలకుదురులో ఉంటున్న ఇంటికి రాగా, పోలీసులు భాస్కర్‌రెడ్డితోపాటు ఆయన సోదరుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. కొద్దిరోజుల క్రితమే వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తమ అరెస్టుకు బోడె ప్రసాద్‌ కారణమని భాస్కర్‌రెడ్డి అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలో +447773212073 నంబరు నుంచి ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్‌ చేశాడు. ఎమ్మెల్యే ఫోన్‌ ఎత్తగానే.. తన పేరు మాలపాటి భాస్కర్‌రెడ్డి అని చెప్పాడు. ‘నువ్వు నన్ను జైలుకు పంపావు కదా? ప్రాణాలతో ఎలా తిరుగుతావో చూస్తాను’ అని బెదిరించాడు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులనూ అసభ్యకరంగా దూషించాడు. ఫేస్‌బుక్‌లో భాస్కర్‌రెడ్డి మాలపాటి అన్న ఖాతా నుంచి ఎమ్మెల్యేను అసభ్యకరంగా దూషిస్తూ పోస్టింగ్‌లు పెట్టాడు. దీనిపై బోడె పెనమలూరు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 09 , 2026 | 05:48 AM