కూటమి విచ్ఛిన్నానికి వైసీపీ కులం కుట్ర
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:26 AM
కూట మి పార్టీలను, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తోందని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు.
అంబటి చూపించిన ఫొటో సాయికృష్ణది కాదు.. నవీన్‌రెడ్డిది
కుట్ర రాజకీయాలు వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య: ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, జూన్ 18(ఆంధ్రజ్యోతి): కూట మి పార్టీలను, ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కులం రంగు తెరపైకి తెస్తోందని ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘నేరస్తుడు ఎంతటి వాడైనా చట్టపరంగా చర్యలు తప్పవు. దీనిపై చట్టపరంగా విచారణ జరుగుతున్న సమయంలో వైసీపీ నేత అంబటి రాంబాబు విడుదల చేసిన ఆ ఫొటో సాయికృష్ణది కాదు.. నవీన్‌రెడ్డిది. అంబటి విడుదల చేసిన రక్తపు మడుగులో ఉన్న ఫొటో పూర్తిగా ఫేక్. అసలు ఈ ఫొటోలు అంబటికి ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలి. నిజంగా ఫొటోలు మీ వద్దకు వచ్చి ఉంటే బాడీ ఎక్కడ ఉందో కూడా మీకు తెలిసి ఉండాలి. వాటి మూలం ఏమిటనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సాయికృష్ణ అదృశ్య ఘటనతో కూటమికి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసం నిరాధార ఆరోణలు చేస్తూ వైసీపీ ప్రజలను పక్కదోవ పట్టిస్తోంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్య చేస్తే... అది నేరమే. రుజువైన నాడు చట్టపరంగా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది. కందుకూరులో జరిగిన హత్య ఉదంతంలోను వైసీపీ రాద్ధాంతం చేసింది. అప్పడు చనిపోయింది, చంపింది ఇద్దరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. దాన్ని జనసేన వైపు వైసీపీ మళ్లించింది. ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఏది వాస్తవమో ప్రజలకు తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు ప్రజలే వైసీసీకి బుద్ధి చెబుతారు’ అని బొలిశెట్టి అన్నారు. సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.