Share News

వైఎస్‌ జయంతి వేడుకలో డిష్యుం డిష్యుం

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:39 AM

వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుక సందర్భంగా ఇద్దరు వైసీపీ మహిళా నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. బుధవారం ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయం ఇందుకు వేదికైంది.

వైఎస్‌ జయంతి వేడుకలో డిష్యుం డిష్యుం

  • ఒంగోలులో మహిళా నేతల గొడవ

  • కాలు తొక్కడంతో మొదలైన ఘర్షణ

  • నాయకురాలిపై మరో నేత భర్త దాడి

  • రెండు వర్గాలుగా విడిపోయి రచ్చ

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుక సందర్భంగా ఇద్దరు వైసీపీ మహిళా నాయకుల మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణకు దారితీసింది. బుధవారం ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయం ఇందుకు వేదికైంది. కేక్‌ కటింగ్‌ చేసే సమయంలో వైసీపీ ఎస్టీ సెల్‌ ఒంగోలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పేరం ప్రసన్న కాలును మరో మహిళా నాయకురాలు మేరికుమారి తొక్కడంతో గొడవ మొదలైంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు సర్దిచెప్పడంతో మొదట వివాదం సద్దుమణిగింది. కార్యక్రమం ముగిసిన అనంతరం మరోసారి వివాదం చోటు చేసుకుంది. మేరికుమారి భర్త కుమార్‌ ఒక్కసారిగా ప్రసన్నపై దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రసన్న కూడా కేకలు వేస్తూ ఎదురుదాడికి దిగారు. అక్కడ ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారిని విడిపించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ప్రసన్నపై దాడి విషయాన్ని తెలుసుకున్న కొంతమంది నాయకులు అక్కడికి చేరుకొని కుమార్‌పై దాడిచేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. కేకలు, అరుపులతో పార్టీ కార్యాలయం దద్దరిల్లిపోయింది. ఈ ఘర్షణలో కొందరు కిందపడ్డారు. ఈ దశలో కొంతమంది పెద్ద నాయకులు జోక్యం చేసుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తనపై దాడిచేసిన కుమార్‌పై ప్రసన్న విరుచుకుపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. ఒక ఎస్టీ మహిళపై పార్టీ కార్యాలయంలోనే దాడి చేయడం సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడిచేసిన వారిపై ఆమె ఒంగోలు తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌కృష్ణ తెలిపారు.

Updated Date - Jul 09 , 2026 | 03:40 AM