Share News

14 నిమిషాల్లో ముగిసిన మండలి

ABN , Publish Date - Feb 19 , 2026 | 05:20 AM

శాసన మండలిలో రెండో రోజు బుధవారమూ వైసీపీ తన ఆందోళనను కొనసాగించింది. తిరుమల లడ్డూ కల్తీ, ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై తమ వాయిదా...

14 నిమిషాల్లో ముగిసిన మండలి

  • చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ

  • ఇందాపూర్‌, హెరిటేజ్‌లపై చర్చకు పట్టు

  • సభా సమయం వృథా చేస్తోంది: హోం మంత్రి

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో రెండో రోజు బుధవారమూ వైసీపీ తన ఆందోళనను కొనసాగించింది. తిరుమల లడ్డూ కల్తీ, ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ నెయ్యి సరఫరాపై తమ వాయిదా తీర్మానాలను చర్చకు అనుమతించాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పోడియంను చుట్టముట్టారు. దీంతో బుధవారం మండలి ఆరంభమైన తొమ్మిది నిమిషాలకే వాయిదా పడింది. చైర్మన్‌ మోషేన్‌ రాజు ఐదు నిమిషాలు మాత్రమే వాయిదా వేసినా... సభ తిరిగి 1.04 గంటలకు ప్రారంభమయింది. వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో మండలిని గురువారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. దీంతో మొత్తం 14 నిమిషాలు మాత్రమే సభ జరిగినట్లు రికార్డుల్లో నమోదయింది. కాగా ఉదయం 10.03 గంటలకు మండలి సమావేశమైనప్పుడు.. మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, టీ రత్నాబాయి మృతికి సంతాపం తెలుపుతూ చైర్మన్‌ తీర్మానం ప్రవేశపెట్టారు. సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం.. వైసీసీ ఎమ్మెల్సీల వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినట్లు చైర్మన్‌ ప్రకటించారు. అయినా వైసీపీ సభ్యుల నినాదాలు ఆగకపోవడంతో... టీడీపీ సభ్యులు కూడా నినాదాలకు దిగారు. వైసీపీ వ్యవహార శైలిపై మంత్రులు లోకేశ్‌, కేశవ్‌ అసహనం వ్యక్తం చేశారు. సభ వాయిదా పడింది. పునఃప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు తిరిగి ఆందోళనకు దిగారు. తిరస్కరించిన తీర్మానాలపై చర్చ ఉండదని చైర్మన్‌ ప్రకటించినప్పటికీ వైసీపీ సభ్యులు విరమించలేదు. వారిపై హోం మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిన్నటి నుంచి సంబంధం లేని అంశాన్ని తెచ్చి, సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. ప్రజాహితం కోసం సభలో ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కల్తీ లడ్డూపై చర్చకు సిద్ధమో కాదో వైసీపీ సభ్యులు తేల్చుకోవాలి.


వైసీపీ వాళ్లు రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవడం బాధాకరం. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వారు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూల్లో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని మేం చెప్పడం కాదు. సీబీఐ చార్జిషీట్‌లోనే స్పష్టం చేసింది. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు’ అంటూ మండిపడ్డారు. ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ‘తప్పు చేయనప్పుడు మేమిచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం చర్చకు అనుమతించాలి’ అని డిమాండ్‌ చేశారు. వైసీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మండలిని గురువారం ఉదయానికి వాయుదా వేస్తున్నట్లు చైర్మన్‌ మధ్యాహ్నం 1.09 గంటలకు ప్రకటించారు.


ఇందాపూర్‌తో చీకటి ఒప్పందం: బొత్స

‘దేవదేవుడి ప్రసాదంపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేసింది. ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదని సీబీఐ తేల్చింది’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతి అసెంబ్లీ మీడియా పాయంట్‌లో ఆయన మాట్లాడారు. ‘హెరిటేజ్‌ సంస్థ ఇందాపూర్‌తో చీకటి ఒప్పందం చేసుకుంది. దోచుకోవడమే హెరిటేజ్‌ ఆలోచన. ఎందుకు సభలో చర్చించడానికి ఈ ప్రభుత్వానికి భయం? బడ్జెట్‌తోపాటు ఇందాపూర్‌పైనా సభలో చర్చించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 19 , 2026 | 05:21 AM