Share News

పెద్ద దస్తగిరి హత్య.. తాడేపల్లి స్ర్కిప్టే!

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:34 AM

రాష్ట్రంలో అధికారం కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగించే విష సంస్కృతిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రవేశపెట్టారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.

పెద్ద దస్తగిరి హత్య.. తాడేపల్లి స్ర్కిప్టే!

  • వైసీపీ నేతే పొట్టనపెట్టుకున్నారు: నిమ్మల

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అధికారం కోసం, ఆస్తుల కోసం, డబ్బు కోసం ఎంతకైనా తెగించే విష సంస్కృతిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రవేశపెట్టారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. కడపలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరిని సొంత పార్టీ నేతే పొట్టనపెట్టుకున్నారని, తాడేపల్లి స్ర్కిప్టు ప్రకారమే ఈ హత్య జరిగిందని విమర్శించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిమ్మల విలేకరులతో మాట్లాడారు. జగన్‌ది రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయినే గొడ్డలిపోటుతో హతమార్చిన చరిత్రని, అదే బాటలో నేడు కార్యకర్తల ప్రాణాలు కూడా బలి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘జగన్‌ దృష్టిలో సొంత చిన్నాన్న అయినా.. తల్లయినా.. చెల్లయినా రాజకీయ పావులే తప్ప మరేమీ కాదు. 2018లో కోడి కత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చి, ఆ కేసులో నిందితుడిగా ఉన్న పేద దళితుడి జీవితాన్ని ఎలా బలిపెట్టారో రాష్ట్రమంతా చూసింది. తన అధికారం కోసం సామాన్యుడి జీవితాన్ని నాశనం చేయడమే జగన్‌ మార్కు రాజకీయం. అధికార దాహం తీర్చుకోవడానికి కార్యకర్తలను వాడుకుంటారు. అవసరం తీరాక వారిని కూడా పెద్ద దస్తగిరిలా బలి తీసుకుంటారు. ఈ విషయాలను వైసీపీ కార్యకర్తలు గమనించాలి. ఆ పార్టీలో ప్రాణాల కంటే పైసలకే ఎక్కువ విలువ. వైసీపీ గొడ్డలి పార్టీగా.. రప్పారప్పా పార్టీగా మారింది’ అని నిమ్మల దుయ్యబట్టారు.

Updated Date - Apr 21 , 2026 | 04:35 AM