Share News

వైసీపీలో ‘ఇఫ్తార్‌’ వివాదం!

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:20 AM

రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని భావించిన వైసీపీని.. సొంత పార్టీ నేతల మధ్య ఏర్పడిన కుమ్ములాటలు ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి...

వైసీపీలో ‘ఇఫ్తార్‌’ వివాదం!

  • నేతల మధ్య కుమ్ములాటలు

  • కార్యక్రమాన్ని తానే చేస్తున్నట్టు మహిళా నేత సోషల్‌ మీడియా ప్రచారం

  • బిర్యానీ కాంట్రాక్టర్‌తో ఫ్లెక్సీలు

  • జగన్‌ వద్దకు చేరిన పంచాయితీ

  • గుంటూరు నుంచి విజయవాడకు మార్పు

గుంటూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని భావించిన వైసీపీని.. సొంత పార్టీ నేతల మధ్య ఏర్పడిన కుమ్ములాటలు ఉక్కిరిబిక్కిరికి గురిచేశాయి. దీంతో ఏకంగా వేదకను మార్చేసింది. అయితే.. ఈ మార్పునకు భద్రతా కారణాలను బూచిగా చూపడం సొంత పార్టీలోనే చర్చకు దారితీసేలా చేసింది. వాస్తవానికి తొలుత ఇఫ్తార్‌ విందును ముస్లింలు ఎక్కువగా ఉండే గుంటూరులో నిర్వహించాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి సహా ఇతర నేతలు ఏర్పాట్లను పరిశీలించి ఖాయం చేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈ నెల 10న ఇఫ్తార్‌ విందుకు సన్నద్ధమయ్యారు. కానీ, అనూహ్యంగా 9వ తేదీ రాత్రి గుంటూరులో ఇఫ్తార్‌ కార్యక్రమం రద్దు చేసినట్టు పార్టీ ప్రకటించింది. భద్రతా కారణాలతోనే రద్దు చేసినట్టు తెలిపింది. అయితే.. పార్టీ నేతల మధ్య జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఈ మార్పు వెనుక గుంటూరు నేతల మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలే కారణమని తెలిసింది. గుంటూరులో నిర్వహించే ఇఫ్తార్‌ కార్యక్రమాన్ని తానే నిర్వహిస్తున్నట్లు ఓ మహిళా నేత సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు, ఇఫ్తార్‌లో వడ్డించే బిర్యానీ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న వ్యక్తిని.. దానికి ప్రతిగా నగరమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరో నేతకు ఆ మహిళా నాయకురాలి వ్యవహారం ఆగ్రహం తెప్పించింది. సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్లు ఆమె వ్యవహారం ఉందని భావించిన ఆయన.. ఈ విషయంపై పార్టీ అధినేత జగన్‌ దగ్గర పంచాయితీ పెట్టారు. దీంతో గుంటూరులో కార్యక్రమాన్ని రద్దు చేసి.. విజయవాడకు మార్చాలని జగన్‌ ఆదేశించినట్టు తెలిసింది. ఫలితంగా గుంటూరులో విందును రద్దు చేశారు. ఆ వెంటనే ఈ నెల 18న విజయవాడలో ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నట్టు మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఇదిలావుంటే, గుంటూరులో ఇఫ్తార్‌ విందు రద్దుకావడంతో మండపానికి, క్యాటరింగ్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇప్పించాలని నిర్వాహకుడు ఒత్తిడి చేసినట్లు తెలిసింది.

Updated Date - Mar 12 , 2026 | 03:20 AM