Share News

కల్తీ నెయ్యిపై డైవర్షన్‌ పాలిటిక్స్‌

ABN , Publish Date - Feb 01 , 2026 | 03:38 AM

తీవ్రమైన వివాదాల్లోకి కూరుకుపోయినప్పుడు.. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టినపుడు.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా.. వైసీపీ వాడే అస్త్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌.

కల్తీ నెయ్యిపై డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • సిట్‌ చార్జిషీట్‌ నేపథ్యంలోనే ‘బూతు పురాణం’

  • ‘కల్తీ’ని సమర్థించుకోలేక వైసీపీ మల్లగుల్లాలు

  • దిక్కుతోచక ప్రజల దృష్టి మళ్లించే ఎత్తుగడ

  • రంగంలోకి అంబటి.. బాబుపై తీవ్ర వ్యాఖ్యలు

  • తానున్నానంటూ మాజీ మంత్రికి జగన్‌ అండ

ఇంటర్నెట్ డెస్క్: తీవ్రమైన వివాదాల్లోకి కూరుకుపోయినప్పుడు.. తీవ్రమైన సమస్యలు చుట్టుముట్టినపుడు.. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా.. వైసీపీ వాడే అస్త్రం డైవర్షన్‌ పాలిటిక్స్‌. గతంలో ప్రతిపక్షంలో ఉన్నా.. తర్వాత అధికారంలో ఉన్నా.. ఇప్పు డు మళ్లీ విపక్షంలో ఉన్నా.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదే ఎత్తుగడ. తామే తప్పులు చేసి ఎదుటివారిపై నిందలు వేయడం.. ప్రజల దృష్టి మళ్లించేందుకు లేదా ప్రజల సానుభూతి కోసం ‘నాటకాలు’ ఆడటం ఆనవాయితీగా వస్తోంది. వివేకా హత్యపై ‘కట్టు’కథలు, కోడి కత్తితో దాడి.. ఇలా ఎన్నో డైవర్షన్‌ పాలిటిక్స్‌ నడిపారు. తాజాగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఎపిసోడ్‌ నుంచి ప్రజల దృ ష్టి మళ్లించేందుకు మరో నాటకానికి తెరలేపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలపడం నిజమేనంటూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ సిట్‌ తేల్చిన సంగతి తెలిసిందే. దీన్ని సమర్థించుకునేందుకు వైసీపీ నేతలు నానా పాట్లు పడ్డారు. టీడీపీపై ఎదురుదాడికి దిగారు. నెయ్యి కల్తీ జరిగినట్టు సిట్‌ చెప్పినా చంద్రబాబు ఆరోపించినట్టుగా నెయ్యిలో జంతుకొవ్వు కలిపినట్టు తేల్చలేదని తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఎన్‌డీడీబీ రిపోర్టు బయటకు రావడంతో తాము చేస్తున్న వాదన లు బూమరాంగ్‌ అయ్యాయని జగన్‌ బృందం గ్రహించింది. దీంతో ప్రజల దృష్టి మళ్లించేలా వైసీపీ నేత అంబటి రాంబాబును రంగంలోకి దింపారు.

Updated Date - Feb 01 , 2026 | 03:39 AM