Share News

వైఎస్‌కు, జగన్‌కు పోలికే లేదు

ABN , Publish Date - Mar 06 , 2026 | 03:51 AM

అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా ఉంటుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. శాసనసభకు ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో...

వైఎస్‌కు, జగన్‌కు పోలికే లేదు

  • ఇతర పార్టీల వారిని శత్రువుల్లా చూస్తున్నారు

  • అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా

  • సభకు రానివారికి జీతాలెందుకు?

  • వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరీపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ అభిప్రాయాలను కోరా: అయ్యన్న

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా ఉంటుందని స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. శాసనసభకు ప్రతిపక్షం హాజరు కాకపోవడంతో సమావేశాలు ఉప్పులేని పప్పులా చప్పగా నడుస్తున్నాయని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోని తన చాంబర్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రజల పక్షాన ప్రభుత్వ విధానాల అమలులోని లోపాలపై నిలదీసేందుకు అవకాశం ఉందన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం తనకు లేదన్నారు. ప్రతిపక్ష హోదా పొందేందుకు తగిన సంఖ్యాబలం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. మండలిలో ప్రజా సమస్యలపై చర్చ జరగడం లేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. పెద్దల సభ అంటే పెద్ద ఆలోచనలు ఉండేవారు సభ్యులుగా ఉండాలన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు వేరైనా ఒకరితో మరొకరు స్నేహపూర్వకంగా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటూ మెలిగేవారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, జగన్‌ తన పార్టీ కానివారిని శత్రువులుగా చూస్తున్నారని అన్నారు. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇతర పార్టీల నేతలనూ గౌరవించేవారన్నారు. వైఎస్‌కు, జగన్‌కు పోలికే లేదన్నారు. విశాఖలో రామానాయుడు స్ట్టూడియో ప్రారంభసభలో ముందువరుసలో ప్రేక్షకుడిలా కూర్చున్న తనను చూసిన వైఎస్‌ స్టేజీ మీదకు రావాలని పిలిచారన్నారు. తాను వెళ్లకపోతే.. కలెక్టర్‌ను పిలిచి ఎమ్మెల్యేగా ప్రొటోకాల్‌ ఇచ్చి వేదికపైకి తీసుకురావాలని ఆదేశించారన్నారు. తాను కిందనే ఉండిపోతే.. సభ ముగిశాక తన వద్దకు వచ్చి ఎలా ఉన్నారంటూ వైఎస్‌ పలుకరించారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాకపోవడంపై స్పీకర్‌ స్పందిస్తూ.. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశానని చెప్పారు. వారి నుంచి అధికారికంగా వచ్చే సమాచారం మేరకు చర్యలుంటాయన్నారు. జగన్‌ నెల జీతాన్ని తీసుకోవడం లేదని, మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని, సభకు హాజరుకాకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

Updated Date - Mar 06 , 2026 | 03:52 AM